logo

ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు కాలు కదపరు.. తయారీదారులు కల్తీ ఆపరు!

నగరంలో ఆహార కల్తీ ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో చిన్నారులు తాగే పాల నుంచి ఆహార పదార్థాల వరకు కల్తీ అధికమైంది.

Published : 28 May 2022 01:49 IST

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

నగరంలో ఆహార కల్తీ ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో చిన్నారులు తాగే పాల నుంచి ఆహార పదార్థాల వరకు కల్తీ అధికమైంది. చాలా హోటళ్లలో కుళ్లిన మాంసం, పాడైన వస్తువులతో వండి వారుస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతో లక్షలాది మంది.. నాణ్యత లేని ఆహారాన్నే తినాల్సి వస్తోంది. బల్దియా పరిధిలో 22 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నా చాలామంది ప్రధాన కార్యాలయాన్ని వదిలి క్షేత్రస్థాయికి రావడం లేదు.

నియమించినా..

నగరంలో ఆహార రంగం అతిపెద్దది. హైదరాబాద్‌ బిర్యానీ, మాంసాహారం ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచాయి. వేలాదిగా ఉన్న హోటళ్లలో రోజు లక్షలాది మంది భుజిస్తుంటారు. ఏడాదిన్నర కిందటి వరకు జీహెచ్‌ఎంసీ ఆహార విభాగంలో ఇద్దరే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి మరో 20 మందిని నియమించింది. 22 మంది వారంలో 5 రోజుల పాటైనా హోటళ్లలో తనిఖీలు చేసి ఆహార నాణ్యత పరిశీలించాల్సి ఉంటుంది. కానీ వారు కార్యాలయాల నుంచి కదలడం లేదన్న ఫిర్యాదులున్నాయి.

ఏం జరుగుతోంది?

నగరంలో కొన్ని హోటళ్లు నాణ్యతను అసలు పట్టించుకోవడం లేదు. మాంసాహార వంటకాలకు రంగు తెప్పించేందుకు నిషేధిత టర్‌ట్రాజైన్‌ అనే సింథటిక్‌ రసాయనాన్ని కలుపుతున్నారు. ఇటీవల పటాన్‌చెరు వద్ద యూరియాతో పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా నగర ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మిఠాయిల్లోనూ నాణ్యత ఉండడంలేదని చెబుతున్నారు. నాసిరకం వంట నూనెలు తయారవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు కనీస సమీక్ష చేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని