logo
Published : 28 May 2022 02:03 IST

ఒంటరి వృద్ధురాలి దారుణ హత్య


తలారి సుజాత

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. తల్లి చరవాణి స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అనుమానం వచ్చిన కుమార్తె ఆరా తీయగా దారుణం వెలుగు చూసింది. సికింద్రాబాద్‌ పాన్‌బజార్‌కు చెందిన తలారి సుజాత(72) కుటుంబం అయిదేళ్ల కిందట సుచిత్రా కూడలి సమీపంలోని కృష్ణమూర్తినగర్‌కు చేరింది. రెండేళ్ల కిందట భర్త అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. కుమారుడు కిరణ్‌కుమార్‌ మలేషియాలో ఉంటున్నారు. కొంపల్లిలో కూతుళ్లిద్దరూ నివసిస్తున్నారు. సుజాత ఒంటరిగా కృష్ణమూర్తినగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. చిన్న కుమార్తె అనిత తల్లితో ఈ నెల 24న ఫోన్‌లో మాట్లాడింది. శుక్రవారం ఉదయం పెద్ద కుమార్తె కవిత తల్లికి ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆందోళనకు గురైన ఆమె.. తల్లి నివాసానికి సమీపంలో ఉండే పవన్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పి, ఇంటికెళ్లి చూడమని కోరారు. అతడు వెళ్లి చూడగా సుజాత ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడ నుంచి దుర్వాసన రావటంతో ఇదే విషయాన్ని ఆయన కవితకు తెలిపారు. దాంతో శుక్రవారం ఉదయం ఇద్దరు కుమార్తెలు ఇంటికి వచ్చి తాళం బద్దలుగొట్టి చూడగా తల్లి మృతదేహం కనిపించింది.

అతడిపైనే అనుమానం..

సుజాత నివసించే పక్కింట్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజీవ్‌ కుటుంబం ఉంటోంది. 3-4 నెలలుగా సరిగా అద్దె చెల్లించకపోవటంతో ఇంటి యజమాని ఒత్తిడి చేశారు. దాంతో చెక్‌ ఇచ్చాడు. అది కూడా బౌన్స్‌ అయ్యింది. దాంతో అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అతడు పలుమార్లు సుజాత వద్ద కూడా చేబదులుగా డబ్బు తీసుకున్నాడని.. తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు వింతగా ప్రవర్తించాడని స్థానికులు తెలిపారు. మంగళవారం సుజాత మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదే రోజు సాయంత్రం రాజీవ్‌ ఇల్లు ఖాళీ చేశాడు. బీరువా తెరిచే ఉన్నా అందులోని 20 తులాల బంగారు నగలు అలాగే ఉన్నాయి. క్లూస్‌ టీం నిపుణులు ఘటనా స్థలాన్ని సందర్శించి వేలిముద్రలు సేకరించారు. రాజీవే ఈ దారుణానికి తెగించి ఉండవచ్చనే కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు అతడి గురించి ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేశ్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని