logo
Published : 28 May 2022 02:03 IST

పడకల పెంపు వారి కోసమేనా?

గాంధీలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకంపైనే దృష్టి

వైద్యులు, నర్సులను పెంచక ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి

* పెరిగిన ఛార్జీల ప్రకారం ప్రతి నాలుగో తరగతి సిబ్బందికి నెలకు రూ.15,600 వేతనమివ్వాలి. ఈ మొత్తం వారికే అందితే అభ్యంతరముండదు. వారి ఖాతాలో ఈ మొత్తం పడ్డాక కొందరు కమీషన్లు నొక్కుతున్నట్లు విమర్శలున్నాయి. పీఎఫ్‌, ఈఎస్‌ఐలాంటి సేవలకు గుత్తేదారులు ఎసరు పెడుతున్నారు. సిబ్బంది నుంచి ఆ మొత్తం మినహాయించి జేబులో వేసుకుంటున్నారు. గతంలో గాంధీలో ఈ పరిస్థితి ఎదురైంది.

* గతంలో ఒక పడకకు రూ.5018 వేలు శానిటేషన్‌ సేవలకు కేటాయించేవారు. ఇటీవల ఆ మొత్తాన్ని రూ.7,500 చేశారు. గాంధీలో కూడా గుత్తేదారుకి చెల్లించే మొత్తం రెండింతలు కానుంది. పెరిగిన ఛార్జీల ప్రకారం గుత్తేదారుకి ఏటా రూ.13.68కోట్లు అందించాలి. ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో ఉన్నతాధికారులకే తెలియాలి.

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి: కొవిడ్‌ అనంతరం రోగుల తాకిడితో గాంధీ ఆసుపత్రిలో అన్ని విభాగాలు కిటకిటలాడుతున్నాయి. అధికారికంగా ఉన్న 1012 పడకలను 2019 నుంచి 1518 వరకు పెంచారు. అనధికారింగా మరో 500 నిర్వహిస్తున్నారు. అధికారికంగా పడకలు పెంచే సమయంలో వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందినీ పెంచాలి. పారిశుద్ధ్యం, భద్రత, పేషెంట్‌కేర్‌ సేవలు పడకలకు తగ్గట్టు నియమించాలి. గాంధీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. 1012 పడకలు ఉన్నప్పటి వైద్యులు, సిబ్బందే సేవలందిస్తున్నారు. నాలుగో తరగతి సిబ్బంది సేవలను మాత్రం రెట్టింపుచేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సెక్యూరిటీగార్డులు, పేషెంట్‌కేర్‌, పారిశుద్ధ్య కార్మికులు 391 మంది పొరుగుసేవల ద్వారా పనిచేస్తున్నారు. వీరి సంఖ్య దాదాపు రెట్టింపు చేశారు. మొత్తం 683 మందికి పెంచారు. ఈ సేవలను బయట నుంచి గుత్తేదారు సంస్థలు అందిస్తుంటాయి. వీటిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు తేలింది.

నిలోఫర్‌ డైట్‌ కాంట్రాక్టులో అక్రమాలపై హైకోర్టు కలుగజేసుకున్న సంగతి తెలిసిందే. గాంధీలో డైట్‌ కాంట్రాక్టులో అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా నాలుగో తరగతి సిబ్బంది సేవలను పెంచి ఓ సంస్థకు అప్పగించారు. పెంచిన పడకల మేరకు నాలుగో తరగతి సిబ్బంది సేవలు అవసరమే. వైద్యులు, సిబ్బంది లేకుండా అన్ని పడకలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అలా చేస్తే వైద్యులపై ఒత్తిడి ప్రభావం రోగుల సేవలపై పడనుంది. వైద్యులు, అదనపు సిబ్బంది లేకుండా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెంపు ఏంటని ఉన్నతాధికారులే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

* ఆసుపత్రిలో అధికారికంగా 1012 పడకలుండగా 2019 నుంచి 1518కు పెంచారు. పొరుగుసేవల సిబ్బంది కోసమే పెంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

* ఔట్‌సోర్సింగ్‌ సేవల కోసం 1518 పడకల పెంపు పాలసీని తీసుకొచ్చారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

* పెంపు పాలసీని ఆసుపత్రి మొత్తానికి వర్తింపజేయడం వల్ల పలు విభాగాలకు యూనిట్లు, వైద్యులు, అన్నిరకాల సిబ్బంది, అదనపు పోస్టులు, మందులు, పడకలు, ఇతర సౌకర్యాలు మెరుగుపడతాయని అంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజు ఓపీ రోగులు 3 వేలుండగా, ఇన్‌పేషెంట్ల సంఖ్య 1400కి పెరిగింది. ఆ మేరకు సేవలందడం లేదు.

* 2008 నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పదవీ విరమణ పొందుతున్నవారి స్థానంలో కొత్తగా వస్తుంది తక్కువే. కీలక పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేస్తున్నారు.

* ఈ ఏడాది జనవరి వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌, పలు వైద్యుల పోస్టులు మొత్తం 37 విభాగాల్లో పెద్దసంఖ్యలోనే ఖాళీలుండగా కొద్దిమందినే కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేశారు. ఇది పెరిగిన పడకల మేరకు లేదు.

* ప్రస్తుతం పలు విభాగాల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. యూనిట్లు పెంచాలన్నా వైద్య సిబ్బంది సరిపోవడం లేదు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని