logo
Published : 28 May 2022 02:58 IST

నాసిరకం పనులతో.. ప్లాట్ల అమ్మకం

కొడంగల్‌లో స్థిరాస్తి వ్యాపారుల దందా


అనుమతులు ఇవ్వడంతో కుంటలో ఏర్పాటు చేసిన వెంచర్‌

కొడంగల్‌, న్యూస్‌టుడే: జాతీయ రహదారిని ఆనుకుని కొడంగల్‌ పట్టణం విస్తరిస్తుంది. ఇటీవల గ్రామాల్ని కలిపి పురపాలికగా అబివృద్ధి చేస్తున్నారు. దీంతో సమీప పల్లెవాసులు సైతం అక్కడ సొంతిళ్లు నిర్మించుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్థిరాస్తి వ్యాపారులు దందా సాగిస్తున్నారు. పార్కులు, డ్రైనేజీ, వీధి దీపాలు, బీటీరోడ్లు, విశాలమైన దారులు ఇలా ఎన్నో చెప్పి ప్లాట్లను అంటగడుతున్నారు. తీరా చూస్తే సౌకర్యాలు లేక కొనుగోలు దారులు ఇబ్బందులు పడటం ఆందోళన కల్గిస్తుంది. అంతేకాదు.. ఆ తర్వాత అక్కడ అభివృద్ధి చేయడానికి పురపాలికకు తలకు మించిన భారంగా మారుతుంది.

పరిస్థితి ఇలా..: మున్సిపల్‌ పరిధిలో దాదాపు 32 వెంచర్లు ఉన్నాయి. ఇందులో అన్ని వెంచర్లలో ప్లాట్లు అమ్ముకోగా కేవలం 5 నుంచి 6 వెంచర్లలో మాత్రం క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొనుగోలు చేసిన వారు మోసపోతూనే ఉన్నారు. లేఅవుట్లలో నాసిరకం అభివృద్ధి పనులు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా ఉండడంతో దందా సాగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలోని కొత్తగా వెలసిన కాలనీల్లో అభివృద్ధి పనుల భారం మళ్లీ పురపాలికపైనే పడుతోంది. పట్టణంలోని ఓ కాలనీలో సుమారు 8 ఎకరాల్లో గతంలో వెంచర్‌ ఏర్పాటు చేశారు. అందులో ప్లాట్ల ధర పెంచుకోవడానికి భారీ గుంతలను తూతూ మంత్రంగా పూడ్చి వేశారు. నాసిరకంగా దారులు, పైపుల ద్వారా కాలువల నిర్మాణం చేశారు. ఆ రహదారులపై గుంతలు పడ్డాయి. ఇటీవల కాలువలు ధ్వంసం అయ్యాయి. కానీ తర్వాత అమ్మకం దార్లు పట్టించుకోలేదు. దీంతో మున్సిపల్‌ అధికారులు ఇప్పటి వరకు దాదాపు రూ.50 లక్షల విలువైన రోడ్ల పనులు నిర్వహించారు. అయినా కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉండడంతో మరో రూ.50 లక్షల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరైనట్లు తెలిసింది. ఇక ఆకాలనీ పక్కనే మరో 5 ఎకరాల్లో రెండోది ఏర్పాటు చేశారు. అక్కడా నాసిరకంగా రహదారులు నిర్మాణం చేశారు. ఇలా నాసిరకంగా పనులు చేసినా ఆయా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది. ఇటీవల కొడంగల్‌- కొండారెడ్డిపల్లికి వెళ్లేదారిలోనూ ప్లాట్లు చేసిన వ్యక్తులు వాటిని అమ్ముకొని వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత మున్సిపల్‌ అధికారులు అక్కడ ఇళ్ల నిర్మాణం అనుమతులు నిలిపి వేశారు. ఉన్నత సాయి అధికారులు వెంచర్‌కు అనుమతులు ఎలా ఇచ్చారు? ప్రస్తుతం అధికారులు ఎలా అడ్డుకొంటారని కొనుగోలు దారులు ప్రశ్నిస్తున్నారు.

సౌకర్యాలు ఉన్న చోటనే కొనండి.. : నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌

ప్లాట్లను కొనే ముందు రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అనే విషయాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేయాలి. అధికారులు కూడా వాటికే అనుమతి ఇస్తారు. అన్ని విషయాలు పక్కాగా ఉన్నాయని గుర్తించిన తర్వాతే ప్లాట్లకు డబ్బులు చెల్లించండి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని