logo

మంచి తరుణం

జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లోని సంఘాలకు సెర్ప్‌ ద్వారా, పట్టణ ప్రాంతల్లో మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. సంఘాల్లో నమోదైన వారికి మిగిలిన సభ్యుల రుణాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మంజూరు చేస్తున్నారు.

Updated : 28 May 2022 04:29 IST

పెరిగిన స్త్రీనిధి లక్ష్యం

వేగం పెంచితేనే ప్రయోజనం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


మహిళలు నిర్వహిస్తున్న దుకాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు

మహిళాభ్యున్నతికి సర్కారు వివిధ పథకాలను ప్రారంభించి వారి భవితకు బాటలు వేస్తోంది. స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అడిగిన వెంటనే వీరికి స్త్రీనిధిని మంజూరు చేస్తున్నారు. ఈసారి మొత్తాన్ని భారీగా పెంచి, వందల మందికి అదనంగా పొందే అవకాశాన్ని కల్పించారు. సంఘాల్లో సభ్యులైన వారంతా సద్వినియోగం చేసుకోనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, పంపిణీలో వేగం పెంచితేనే లక్ష్యం చేరే ఆస్కారముంటుంది. వేలాది మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈనేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం...

జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లోని సంఘాలకు సెర్ప్‌ ద్వారా, పట్టణ ప్రాంతల్లో మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. సంఘాల్లో నమోదైన వారికి మిగిలిన సభ్యుల రుణాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మంజూరు చేస్తున్నారు. రూ.25వేల నుంచి రూ.3లక్షల వరకు పొందే వెసులుబాటు కల్పించారు. 48గంటల నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇచ్చేలా నిబంధన అమలు చేస్తున్నారు. చరవాణి ద్వారా అర్జీ చేస్తే సత్వరమే స్పందిస్తూ, సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, పారదర్శకతకు శ్రీకారం చుట్టడంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

మొదటి త్రైమాసికంలో మందగమనం

ఈ ఆర్థిక సంవత్సరం రూ.78.30 కోట్లు అందించేందుకు సన్నాహాలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.11.39 కోట్లను అదనంగా అందించబోతున్నారు. అత్యధికంగా దోమ మండలంలో రూ.5.41 కోట్లు, మోమిన్‌పేటలో రూ.4.86 కోట్లు, అత్యల్పంగా ధారూరు మండలంలో రూ.1.11 కోట్లు అందించేందుకు లక్ష్యం ఖరారు చేశారు. కరోనా సమయంలో విరివిగా అందించిన అధికారులు వంద శాతానికి మించి పంపిణీ చేశారు. ఆ తర్వాత, అంతకుముందు సంవత్సరాల్లో శతశాతం లక్ష్యం చేరుకోలేదు. మొదటి, రెండో త్రైమాసికాల్లో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. వేగవంతం చేస్తే వంద శాతం పూర్తి చేసే వీలుంటుంది. ఆ దిశగా సీసీలు, వీఓఏలు, ఏపీఎంలు చొరవ చూపాల్సి ఉంది. ఈసారి గ్రామాల్లో 3.36 శాతం, పట్టణాల్లో 9.34శాతం పంపిణీ పూర్తైంది.


ఎంపిక చేసిన యూనిట్లు ఇవే..


అలంకరణ వస్తువిక్రయాలతో..

గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ శాతం అలంకరణ వస్తువుల విక్రయం, పిండి మరలు, కిరాణం, మిఠాయిలు, దుస్తుల విక్రయ దుకాణాలు, పాడి పశుపోషణ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. వీటిని నెలకొల్పేందుకు రూ.50వేల నుంచి రూ.2లక్షల దాకా ఖర్చవుతోంది. రుణం పొంది వీటిని ప్రారంభించి అభివృద్ధి చెందుతున్నారు. వచ్చే ఆదాయం నుంచి వాయిదాలు చెల్లిస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారు. అరవై నెలల్లో తీర్చేందుకు వెసులుబాటు కల్పించడం కలిసొచ్చింది.


గంటల్లోనే మంజూరు : తుమ్మల వేణు, మెప్మా, స్త్రీనిధి జిల్లా మేనేజరు

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు దరఖాస్తు చేసిన గంటల వ్యవధిలో రుణం మంజూరు చేస్తున్నాం. రూ.లక్షకు మించి ఉంటే వారంపదిరోజుల్లో ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న యూనిట్లను ఏర్పాటు చేయించి సద్వినియోగం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.


ఎప్పటికప్పుడు పర్యవేక్షణ : కృష్ణన్‌, డీఆర్‌డీవో

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబరు నెలాఖలోగా వంద శాతం పంపిణీ చేసేలా మండల, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించాం. మంజూరుపై నెలనెలా సమీక్షిస్తాం. దరఖాస్తు చేసిన సభ్యులకు రూ.3లక్షల దాకా ఇస్తాం. యూనిట్లను, వ్యాపారాలను సాఫీగా నిర్వహించేలా పర్యవేక్షణ చేయిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని