logo
Published : 29 May 2022 01:52 IST

అభివృద్ధికి నిధుల గండం...అప్పులతో సతమతం

 నిలిచిన రూ.50 కోట్లు  
 ఐదు నెలలుగా చెక్కులకు కలగని మోక్షం

* బషీరాబాద్‌ మండలంలో ఓ సర్పంచి అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఐదు మాసాల నుంచి బిల్లులు అందకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో ఎకరా పొలం అమ్మి అప్పులు చెల్లించడం చర్చనీయాశంగా మారింది.

* ధారూర్‌ మండలంలోని ఓ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చులు కలిపి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ఐదు నెలలుగా బిల్లులకు మోక్షం కలగక పోవడంతో ఆ సర్పంచి అప్పులు తెచ్చి ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు.

- జిల్లాలో చాలా మంది సర్పంచులు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, వికారాబాద్‌

‘గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.’ ఇందుకోసం సర్పంచులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషిచేయాలి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావాలి. తద్వారా ప్రగతి పనులు చకచకా సాగుతాయి. జిల్లాలో ఈ తరహా వాతావరణం కనిపించడంలేదు. సర్పంచులు వడ్డీకి తెచ్చి అభివృద్ధికి వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. చేసిన ఖర్చులకు కోశాధికారి కార్యాలయం (ట్రెజరీ)లో చెక్కులు జమ చేసినా ఉపయోగం ఉండటం లేదు. నెలకు రూ.10 కోట్ల చొప్పున ఐదు మాసాలకు రూ.50 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో ఖాతాలో నిధులున్నా ప్రభుత్వం అనధికార ఫ్రీజింగ్‌ పెట్టడంతో డ్రా చేసుకోవడానికి వీలు కావడం లేదు. నిధుల లేమి కారణంగా త్వరలో చేపట్టే ‘పల్లె ప్రగతి’పై ప్రభావం పడక తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

నెలకు రూ.లక్ష వరకు ఖర్చు..

పంచాయతీల నిర్వహణ మొత్తం సర్పంచులే చూసుకుంటారు. ట్రాక్టర్లకు డీజిల్‌, వీధి దీపాలు, బోరుమోటార్ల మరమ్మతులు, కార్మికుల జీత భత్యాలు వారే చూసుకుంటున్నారు. చెక్కులు మంజూరైన తర్వాత తీసుకోవచ్చనే ధీమాతో అప్పులు తెచ్చి ఆగకుండా పనులు నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్య మవుతున్నారు. బిల్లులు రావడం లేదని బయటకు చెప్పినా అంతగా ప్రయోజనం ఉండదని మౌనం వహిస్తున్నట్లు కొందరు సర్పంచులు వాపోయారు. 

రెండోసారి పంపినా..

పంచాయతీల ఖర్చులకు సంబంధించిన చెక్కులను ఈ ఏడాది జనవరి నుంచి కోశాధికారి కార్యాలయానికి పంపిస్తున్నారు. చెక్కుల కాల పరిమితి మూడు నెలలు మాత్రమే ఉండటంతో మార్చి వరకు పంపినవి చెల్లుబాటు కాకుండా పోయాయి. ఏప్రిల్‌లో  రెండోసారి పంపించారు. ఇంతలో ప్రభుత్వం నిలిపివేత (ఫ్రీజింగ్‌) నిబంధన పెట్టడంతో మోక్షం కలగడం లేదు. కేవలం విద్యుత్తు బిల్లులకు సంబంధించిన చెక్కులు మాత్రమే చెల్లుబాటవుతున్నాయి. గతంలో పంచాయతీ కార్మికుల వేతనాలు ప్రతి నెల 5వ తేదీలోపు వచ్చేవి. అవికూడా ఐదు నెలలుగా నిలిచిపోయాయి.

ఆర్థిక భారంతో సతమతం  
- శ్రీనివాస్‌రెడ్డి, అధ్యక్షుడు, మండల సర్పంచుల సంఘం, మోమిన్‌పేట

బిల్లులు మంజూరు కాకపోవడంతో సర్పంచులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. పనులు చేసినా బిల్లులు రావడం లేదన్న కారణంతో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిణామం గ్రామాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందుకే పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందేలా చూడాలి. 

త్వరలో మంజూరవుతాయి
- మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీల చెక్కులు క్లియర్‌ కాకపోవడం వాస్తవమే. వివిధ పనుల తాలూకూ అపరిష్కృత బిల్లులు త్వరలో మంజూరు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ముందు వేసిన చెక్కుల కాలపరిమితి ముగియడంతో మరోమారు కోశాధికారి కార్యాలయానికి పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బులు డ్రా కావడం లేదు. చెక్కులన్నీ ఇప్పుడిప్పుడే క్లియర్‌ అవుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని