logo
Updated : 25 Jun 2022 04:26 IST

కస్తూర్బా.. బాలికా విద్యకు వరం

కళకళలాడుతున్న విద్యాలయాలు
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, బొంరాస్‌పేట

ప్రవేశపత్రాలను చూపుతూ..

గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనాథ, నిరుపేద కుటుంబాల బాలికలకు కస్తూర్బా విద్యాలయాలు అండగా నిలుస్తున్నాయి. వసతి కల్పిస్తూ... విద్యాబుద్దులు నేర్పిస్తూ... స్వయం ఉపాధికి అల్లికలు సైతం నేర్పిస్తున్నారు. వీటిల్లో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో బడులు ప్రారంభించిన వారం రోజుల్లోనే పూర్తిస్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ నెల 30 వరకు చేరికకు అవకాశమున్నా, ఇప్పటికే ఖాళీల కంటే ఎక్కువ మంది ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక్కడ చదువుతో పాటు వసతి ఉండటం, ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమం అమలు చేయటంతో డిమాండ్‌ పెరిగింది.

జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 19 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. ఆరో తరగతిలో ఒక్కో కస్తూర్బాలో 40 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఇలా జిల్లాలో 760 మంది బాలికలు చేరేందుకు అవకాశాలు ఉండగా అంతకు ఎక్కువ సంఖ్యలోనే చేర్చుకున్నారు. 7వ తరగతి నుంచి పదోతరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నారు. ఆరు నుంచి పదోతరగతి వరకు ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థులను తీసుకోవాల్సి ఉండగా తల్లిదండ్రుల డిమాండ్‌తో అన్ని తరగతుల్లో కలిపి 250 మంది వరకు ప్రవేశాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు, బాలకార్మికులు, వలస కూలీ కుటుంబాల పిల్లలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చి వరుస క్రమంలో చేర్చుకుంటారు. సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనార్టీ గురుకులాల్లో చేరాలంటే ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించినా అందులో వసతి సదుపాయం లేదు. అర్హత, ప్రవేశ పరీక్షలు లేని కస్తూర్బాలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. ఆరోతరగతి నుంచి వసతి ఉండటం ముఖ్యంగా ఉపాధికి ముంబయి, హైదరాబాద్‌, పుణెకు వలస వెళ్తున్న కుటుంబాల బాలికలు మాత్రం ఇక్కడ చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలోని చౌడాపూర్‌ మండలానికి 2022-23 ఏడాది నుంచి కొత్తగా విద్యాలయం మంజూరు చేయటంతో ఆరు నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ: ఈ విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులు, బోధన సిబ్బంది పనితీరును విద్యాశాఖ అధికారులు పరిశీలన చేస్తుంటారు. పదోతరగతిలో ఉత్తీర్ణత, విద్యార్థులు సాధించే మార్కులు, పిల్లల్లో నైపుణ్యాల ఆధారంగా బోధన సిబ్బందిని కొనసాగిస్తున్నారు. విద్యతో పాటుగా బాలికలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అల్లికలు నేర్పిస్తున్నారు. నిత్యం యోగా, క్రీడల్లోను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా సొంతభవనాలు, వసతి సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 


చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నాం
రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

కస్తూర్బా విద్యాలయాలపై ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కలిగింది. ప్రతి ఏడాది ప్రవేశాల సమయంలో ఖాళీలకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పదోతరగతి వరకు వసతి కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఉపాధి అవకాశాలకు చేతివృత్తుల శిక్షణలో అల్లికలు నేర్పిస్తున్నాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని