logo

పోలీసుల లక్ష్యం..వాహనదారులపై అలక్ష్యం

పోలీసులకు విధించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల లక్ష్యం వాహనదారులకు సంకటంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రద్దీ రహదారులపై రాత్రుళ్లు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను గాలికొదిలేసి వాహనాలను నిలిపేస్తుండడం

Updated : 25 Jun 2022 04:28 IST

నిబంధనలకు విరుద్ధంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు
రాత్రుళ్లు ఇరుకు రోడ్లపై భారీగా ఆగుతున్న ట్రాఫిక్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

పీవీఎన్‌ఆర్‌ వే వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

పోలీసులకు విధించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల లక్ష్యం వాహనదారులకు సంకటంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రద్దీ రహదారులపై రాత్రుళ్లు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను గాలికొదిలేసి వాహనాలను నిలిపేస్తుండడం వల్ల భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఒకే లైన్‌ రోడ్డు ఉన్న చోట్ల బారికేడ్లను పెట్టి మరీ వాహనాలను నిలిపేస్తున్నారు. మహానగరంలో దాదాపు 50 చోట్ల ఈ పరిస్థితి నెలకొంటోంది.
ఇదీ పరిస్థితి
* మాసాబ్‌ ట్యాంక్‌ నుంచి మెహిదీపట్నం రైతు బజారు మీదుగా అత్తాపూర్‌, టోలిచౌకి వెళ్లే రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి భారీ రద్దీ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా పీవీఎన్నాఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఒకటో స్తంభం వద్ద రాత్రి 8 గంటల నుంచి బారికేడ్లను పెట్టి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్‌ సిగ్నల్‌ నుంచి వేలాదిగా వాహనాలు నిలిచిపోతున్నాయి. 400 గజాల దూరాన్ని దాటడానికి అరగంట సమయం పడుతోందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
* మూసారాంబాగ్‌ సిగ్నల్స్‌ వద్దే తరచూ తనిఖీలు చేస్తుండడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తమవుతోంది. ఓవైపు వెళ్లే వాహనాలన్నీ సిగ్నల్స్‌ దగ్గర నిండిపోవడంతో నియంత్రణ కష్టసాధ్యమవుతోంది. అర కి.మీ. ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.
సమీక్షించి చర్యలు: ఏవీ రంగనాథ్‌, నగర ట్రాఫిక్‌ విభాగం చీఫ్‌
రద్దీ కూడళ్ల వద్ద తనిఖీలు చేయొద్దని ఇటీవల ఆదేశించాం. కొన్ని చోట్ల నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సమీక్షించి వెంటనే ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
ఇవీ నిబంధనలు: ఉదయం 10- మధ్యాహ్నం 12 గంటల మధ్య, రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మాత్రమే తనిఖీలు నిర్వహించాలి.
* మూణ్నాలుగు లైన్లు ఉన్న చోట్ల మాత్రమే డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించాలి.
* కొన్ని చోట్ల రాత్రి 7.30 గంటల నుంచే తనిఖీలు ప్రారంభిస్తున్నారు.

లక్ష్యాల వల్లేనా ఇదంతా..  
డ్రంకెన్‌ డ్రైవ్‌లపై ఎన్ని కేసులు నమోదు చేయాలన్న విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది. ఇది పోలీసు కమిషనరేట్ల మధ్య పోటీకి దారితీసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో 25 పోలీసు స్టేషన్లు ఉంటే 400 మంది పోలీసులు తనిఖీల విధులనే నిర్వర్తిస్తున్నారు.  50 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల అడ్డుకట్టకు డ్రంకెన్‌ డ్రైవ్‌ ఆహ్వానించదగినదే అయినా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని