logo

నగరాన భారీ వాన

నగరంలో శుక్రవారం రాత్రి వర్షం కుండపోతగా కురిసింది. కుత్బుల్లాపూర్‌, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, ఏ.ఎస్‌.రావునగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన బీభత్సం సృష్టించింది.

Published : 25 Jun 2022 02:04 IST

ఏఎస్‌ రావునగర్‌లో 3.2 సెం.మీ వర్షపాతం

ఉప్పల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.  పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీల వాసులు అవస్థలు పడ్డారు. నాచారం బాబానగర్‌లో నీట మునిగిన ఓ వీధిలో జాగ్రత్తగా వెళుతున్న స్థానికులు.

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం రాత్రి వర్షం కుండపోతగా కురిసింది. కుత్బుల్లాపూర్‌, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, ఏ.ఎస్‌.రావునగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో గంటపాటు వరుణుడు తెరపినివ్వలేదు. ప్రధాన నగరంలోనూ వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాలానగర్‌ రహదారులు, బస్టాండు వద్ద, మూసాపేటలో నీరు పెద్ద ఎత్తున నిలిచింది. అత్యధికంగా రాత్రి 9గంటల సమయానికి ఏఎస్‌రావునగర్‌లో 3.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మచ్చబొల్లారంలో 3.15, ఉప్పల్‌లో 2.68, కుషాయిగూడలో 2.48, తిరుమలగిరిలో 2.43, అల్వాల్‌లో 2.38, సఫిల్‌గూడలో 2.05, కుత్బుల్లాపూర్‌లో 1.8, బాలానగర్‌లో 1.73, మల్కాజిగిరిలో 1.33సెం.మీ వాన పడింది.

ప్రభావిత ప్రాంతాల్లో అధికారులకు విధులు
వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందుల నివారణకు జీహెచ్‌ఎంసీ చర్యలు ముమ్మరం చేసింది. పూడికతీత పనులను వేగవంతం చేశామని, వరదలొచ్చినప్పుడు ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో అధికారులకు విధులు కేటాయించామని జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ‘ఈనాడు’కు తెలిపారు. రూ.36.98 కోట్లతో వర్షాకాల అత్యవసర బృందాలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రతి చెరువు వద్ద ఓ అధికారి ఇన్‌ఛార్జిగా, ఇద్దరు కేర్‌ టేకర్లుగా ఉండనున్నట్లు ఇంజినీరింగ్‌ విభాగం వెల్లడించింది. చెరువుల్లోకి వచ్చే వరదను అంచనా వేస్తూ దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తామన్నారు. నాలాల్లో ఏర్పడే అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించి వరద సాఫీగా సాగేందుకు వర్షాకాల అత్యవసర బృందాలు పనిచేస్తాయన్నారు. జోన్ల వారీగా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఇన్‌ఛార్జులను నియమించారు. పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణ పనుల వద్ద, నాలా పనుల వద్ద, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ అధికారులకు జీహెచ్‌ఎంసీ విధులు కేటాయించింది.  

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని