logo

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మధ్యప్రదేశ్‌ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. వివరాలను శుక్రవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో

Published : 25 Jun 2022 02:04 IST

తుపాకీ, రూ.4.5 లక్షలు స్వాధీనం

రాజేంద్రనగర్‌, మొయినాబాద్‌, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మధ్యప్రదేశ్‌ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. వివరాలను శుక్రవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వసీం మొహమ్మద్‌(38), మహమ్మద్‌ షరీఫ్‌(54), దిల్లీకి చెందిన మహమ్మద్‌ నసీం(42), జుబైర్‌ వ్యాపారాలు చేసి నష్టపోయారు. వీరు వ్యాపార విషయమై దుబాయ్‌ వెళ్లినప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఒక దేశీయ పిస్తోల్‌తో పాటు తాళాలు పగులగొట్టే సామగ్రిని సిద్ధం చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. మే నెలలో మధ్యప్రదేశ్‌కు వెళ్లిన ఈ ముఠా భోపాల్‌లోని కమలానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇండోర్‌లో పట్టపగలు ఇంటి తాళం పగులగొట్టి రూ.25 లక్షల బంగారు ఆభరణాలు, నగదు దోచేశారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు వారి కదలికలను సీసీటీవీల ద్వారా గుర్తించారు. పట్టుకొనేలోపే అక్కడ్నుంచి తప్పించుకొని హైదరాబాద్‌కు మకాం మార్చారు. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని శాస్త్రీపురంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఈనెల మొదట్లో విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో రూ.1.50 లక్షల విలువ చేసే ఆభరణాలు, రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.3.30లక్షల విలువ చేసే నగలు, నగదు దొంగిలించారు. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన పోలీసు బృందం మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో శాస్త్రీపురంలోని ఉంటున్న ముఠాపై దాడిచేసి షరీఫ్‌, నసీంలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన 40 తులాల బంగారం విక్రయించడానికి వసీం, జుబైర్‌ ఇద్దరూ వెళ్లడంతో తప్పించుకున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీరు వాకీటాకీలను వాడుతున్నారు. వారి నుంచి రూ.4.5లక్షలు, ఓ తుపాకీ, నాలుగు తూటాలు, మూడు వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మైలార్‌దేవ్‌పల్లి సీఐ నరసింహ, డీఐ రాజేందర్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని