logo
Updated : 25 Jun 2022 04:35 IST

చచ్చినా వదలట్లేదు

మృతుల కుటుంబాలను వేధిస్తోన్న జీహెచ్‌ఎంసీ
తప్పులతడకలతో జనన, మరణ ధ్రువపత్రాల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలోని అనంతపురం జిల్లా కానంపల్లికి చెందిన మైలే సాంబశివుడు(54) ఫిబ్రవరిలో వైద్యం కోసం నగరానికి వచ్చారు. అనారోగ్యంతో కోఠిలోని కామత్‌ హోటల్‌ వద్ద మరణించారు. అక్కడే అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేశాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం.. అనంతపురంలో చనిపోయినట్లు ధ్రువపత్రం ఇచ్చి మృతుడి కుటుంబాన్ని ఐదు నెలలుగా వేధిస్తున్నారు. మొదట మృతుడి పేరు, తల్లి పేరు, చనిపోయిన ప్రదేశం తప్పుగా ముద్రించి ధ్రువపత్రం ఇచ్చారు. సర్టిఫికెట్‌ను సవరించమని రెండు సార్లు దరఖాస్తు చేసుకుంటే.. పేర్లను సవరించారు. చనిపోయిన ప్రదేశాన్ని మాత్రం మార్చలేమంటున్నారు. తాజాగా మూడోసారి మృతుడి కుమారుడు ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఉన్నతాధికారి సవరించేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇలా ఎంతోమందిని కొందరు ఉన్నతాధికారులు నిత్యం వేధిస్తున్నారు.
జవాబుదారీతనం లేదు..
* జనవరి 29న మరణించిన సయ్యద్‌ సైజాద్‌ అహ్మద్‌ తరఫున ఆస్పత్రి, శ్మశానవాటికల నుంచి వేర్వేరుగా మరణ ధ్రువపత్రం కోసం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తులొచ్చాయి. కుటుంబసభ్యులు సైతం మీ సేవా కేంద్రానికెళ్లి దరఖాస్తు చేశారు. మూడూ ఆమోదం పొందాయి. ఆస్పత్రుల సిబ్బంది పొరపాటున ఒకరి వివరాలను పదుల సార్లు జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. అవన్నీ ఆమోదం పొందుతున్నాయి. జనన ధ్రువపత్రాల విషయంలోనూ ఇదే జరుగుతోంది.
* చందానగర్‌లో చనిపోయిన వ్యక్తికి కూకట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయం, అబిడ్స్‌లో చనిపోయిన వ్యక్తికి ఖైరతాబాద్‌లో, ఉప్పల్‌లో మరణిస్తే సికింద్రాబాద్‌లో ధ్రువపత్రాలు మంజూరవుతున్నాయి.
* శ్మశానవాటికల్లోని సిబ్బంది మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అంత్యక్రియలు పూర్తయిన మృతుల పేరుతో జీహెచ్‌ఎంసీకి నివేదిక ఇచ్చేస్తున్నారు. మీసేవా కేంద్రాలు జనన, మరణాల రికార్డుల్లో పేరు లేని వ్యక్తులకు నేరుగా నాన్‌ అథెంటికేటెడ్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. వాటిని ఉపయోగించి జనన, మరణ ధ్రువపత్రాలనూ అందజేస్తున్నాయి. ఇలా జారీ చేయొచ్చని జీహెచ్‌ఎంసీ శ్మశానవాటికలకుగానీ, మీ సేవాకేంద్రాలకుగానీ రాత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయినా ప్రక్రియ చాపకింద నీరులా జరిగిపోతోంది.

కారణం ఏమిటంటే..
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోన్న విధానాలు స్థిరంగా ఉండట్లేదు. మూడేళ్ల క్రితం వరకు బల్దియాకు స్పష్టమైన విధానముండేది. పారదర్శకత పేరుతో అధికారులు పాత వ్యవస్థను రోజుకోరకంగా మార్చుతున్నారు. ఫలితంగా.. సమస్యలు పెరిగి నకిలీ ధ్రువపత్రాలు పుట్టుకొస్తున్నాయి. పేర్లు, జన్మ స్థలం, మరణించిన స్థలం వివరాలు తప్పుల తడకగా మారుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని