logo

ఇష్టమైతేనే సర్వీస్‌ ఛార్జీ

కాస్త సమయం దొరికినా... వారాంతమయినా.. నగరవాసులు కుటుంబంతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లలకు వెళ్లి వేడుక చేసుకుంటారు. సరదాగా గడిపి... నచ్చిన ఆహారం లాగించేసి.. వేలాది రూపాయల బిల్లులు, టిప్పులు చెల్లిస్తుంటారు.

Updated : 26 Jun 2022 04:57 IST
తప్పనిసరి కాదని చెబుతున్న నిబంధనలు
బిల్లులో ఆ కాలమ్‌ ఖాళీగా ఉంచాలంటూ తీర్పులు

ఈనాడు, హైదరాబాద్‌: కాస్త సమయం దొరికినా... వారాంతమయినా.. నగరవాసులు కుటుంబంతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లలకు వెళ్లి వేడుక చేసుకుంటారు. సరదాగా గడిపి... నచ్చిన ఆహారం లాగించేసి.. వేలాది రూపాయల బిల్లులు, టిప్పులు చెల్లిస్తుంటారు. కొన్ని రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా వీరి నుంచి సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. చెల్లించడం తప్పనిసరి కాదని తెలిసినా కొందరు తమ చుట్టుపక్కలవారు ఏమనుకుంటారో అన్న మొహమాటంతో, ఇది పెద్ద మొత్తం కాదన్న భావనతోనో డబ్బు కట్టేసి బైటికి వస్తున్నారు. దీనినే రెస్టారెంట్లు ఆదాయంగా మార్చుకుంటూ తప్పనిసరిగా సర్వీస్‌ ఛార్జీ కట్టాలంటూ ఇబ్బందిపెడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆన్‌లైన్‌ బిల్లు చెల్లింపులపై 5శాతం అదనంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.

మచ్చుకు కొన్ని... రంగారెడ్డి జిల్లా లీగల్‌ మెట్రోలజీ అధికారిణి టి.అనురాధాదేవికి ఈ అనుభవం ఎదురైంది... హైటెక్‌సిటీలోని ‘బార్బిక్యూ ప్రైడ్‌’కు వెళ్లి భోజనం ఆర్డర్‌ ఇవ్వగా.. రూ.1378 బిల్లు అయ్యింది. అక్కడి క్యాషియర్‌ రూ.62 సర్వీస్‌ ఛార్జీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో నిబంధనలకు విరుద్ధమంటూ.. ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌.. సర్వీస్‌ ఛార్జీ తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.

* ఓల్డ్‌ మలక్‌పేట్‌కు చెందిన న్యాయవాది కె.రాజశేఖర్‌ స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ‘అంతెరా కిచెన్‌ అండ్‌ బార్‌’లో భోజనానికి వెళ్లారు. బిల్లు రూ.3,543 అయ్యింది. సర్వీస్‌ఛార్జీ 5శాతం వసూలు చేయడంపై అక్కడి సిబ్బందిని పిలిచి ఆ కాలమ్‌ను తొలగించాలన్నారు. ఒప్పుకోని మేనేజర్‌.. తప్పనిసరిగా చెల్లించాలనడంతో బిల్లు కట్టేశారు. అనంతరం హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థ జీఎస్టీతోపాటు అదనంగా సర్వీస్‌ ఛార్జీ 5శాతం వసూలు చేసినట్లు కమిషన్‌ గుర్తించింది. ఆ హోటల్‌ యాజమాన్యం.. వసూలు చేసిన సర్వీస్‌ ఛార్జి తిరిగివ్వాలని, పైగా రూ.3000 చెల్లించాలని పేర్కొంది.

ప్రతినెలా రూ.450 కోట్ల వ్యాపారం

నగరంలో 15 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఫుడ్‌ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రోజుకు సుమారు రూ.15 కోట్లు, నెలకు సుమారు రూ.450 కోట్ల వ్యాపారం సాగుతోంది.


వినియోగదారుడి అంగీకారం మేరకు..

కొన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు..పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు బోర్డు ప్రదర్శించాలని కేంద్రం వెల్లడించింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి.


ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లో సర్వీస్‌కు జీఎస్టీ...

ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా కొనుగోలు చేసినా జీఎస్టీ అంతే ఉంటుంది. రసీదుపై ఆర్డర్‌ చేసిన భోజనం బిల్లు, జీఎస్టీ, డెలివరీ ఛార్జీ ఉంటాయి. వంద రూపాయల భోజనం ఆర్డర్‌ చేస్తే 5 రూపాయల జీఎస్టీ, 25 రూపాయల డెలివరీ ఛార్జీ ఉంటుంది. ఇందులో భోజనం ధర వంద రూపాయలు హోటల్‌ వారికి వెళతాయి. పన్ను రూ.5.. హోటల్‌ ద్వారా ప్రభుత్వానికి చేరతాయి. కానీ, డెలివరీ అనేది ఒక సర్వీసు కాబట్టి దానికి జీఎస్టీ ఉంది. ఆ సర్వీసు పొందినందుకు 18 శాతం పన్ను కట్టాలి. వినియోగదారులు ఆ యాప్‌కి చెల్లించే డెలివరీ ఛార్జీలో ఈ పన్ను కలిసే ఉంటుంది. అది అంత స్పష్టంగా కనపడదు. యాప్‌ నుంచి ఇన్వాయిస్‌ (బిల్లు) డౌన్‌లోడ్‌ చేసి చూస్తే ఈ వివరాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని