logo

చిట్టి గుండెకు గట్టి భరోసా

నిమ్స్‌లో నవజాత శిశువులకు గుండె శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌, సీఎం సహాయ నిధి ఉన్నవారికి ఉచితంగానే ఈ చికిత్సలు చేయనుండడంతో పేద తల్లిదండ్రులకు భరోసా దక్కింది. ఇటీవల పుట్టిన

Updated : 26 Jun 2022 04:51 IST

నిమ్స్‌లో నవజాత శిశువులకూ చికిత్సలు


అధునాతన పరికరాలు

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌లో నవజాత శిశువులకు గుండె శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌, సీఎం సహాయ నిధి ఉన్నవారికి ఉచితంగానే ఈ చికిత్సలు చేయనుండడంతో పేద తల్లిదండ్రులకు భరోసా దక్కింది. ఇటీవల పుట్టిన పిల్లల్లోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. గుండె కవాటాల్లో రంధ్రాలు, హృదయ కండరాల్లో ఇబ్బందులు ఇతరత్రా సమస్యలతో చాలామంది చిన్నారులు పుట్టిన కొన్ని రోజులకే కన్ను మూస్తున్నారు. నిమ్స్‌లో ప్రత్యేకంగా పిడియాట్రిక్‌ హార్ట్‌ సర్జరీ యూనిట్‌ ప్రారంభం కావడంతో ఇలాంటి చిన్నారులకు ఇక ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తాజాగా ఈ విభాగాన్ని ప్రారంభించారు.

విభాగంలోని ఐసీయూ పడకలు

విశేషాలు

* ఇప్పటివరకు నిమ్స్‌లో కేవలం పెద్ద పిల్లలు లేదంటే 5 కిలోల బరువు కంటే ఎక్కువ ఉన్న పిల్లలకు మాత్రమే గుండె శస్త్ర చికిత్సలు అందేవి. పిల్లల కోసం ప్రత్యేకించి విభాగమంటూ లేదు.

* ఇకపై ప్రత్యేకంగా పిల్లల గుండె సమస్యల యూనిట్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. నిమ్స్‌ తరహా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

* గుండెలో లోపాలతో పుట్టిన శిశువులకు కొందరికి రోజుల వ్యవధిలో.. మరికొందరికి ఏడాదిలోపు శస్త్ర చికిత్స చేసి సరిచేయాలి. ఆ తర్వాత చేసినా ప్రయోజనం ఉండదు. చాలామంది పేదలు స్తోమత లేక పిల్లలకు చికిత్సలు చేయించలేకపోతున్నారు.

* దీనికి మొత్తం 50 పడకలు కేటాయించారు. ఇందులో 6 పడకలతో అత్యాధునిక మాడ్యులర్‌ కార్డియోథొరాసిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ) ఏర్పాటు చేశారు. పిల్లల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్‌-1 ఎయిర్‌ కండిషన్డ్‌ ఐసొలేషన్‌ వార్డు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అతి సూక్ష్మమైన వైరస్‌, బ్యాక్టీరియాను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉంటాయి.  

* శస్త్ర చికిత్స చేసేప్పుడు అవసరమయ్యే అత్యాధునిక హార్ట్‌ లంగ్‌ యంత్రాన్ని రూ.40 లక్షలతో అమర్చారు.

* శస్త్ర చికిత్స సమయంలో శరీరంలో జరుగుతున్న మార్పులను పసిగట్టి ముందే వైద్యులను హెచ్చరించే అధునాతన కార్డియాక్‌ అవుట్‌పుట్‌ మానిటర్‌ను అమర్చారు. పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్‌ ఆక్సైడ్‌ సరఫరా యంత్రం ఏర్పాటు చేశారు.

* నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పిడియాట్రిక్‌, నియోనాటల్‌ సామర్థ్యాలతో పనిచేసే యూనిట్‌ అందుబాటులోకి వచ్చింది.


పుట్టుకతో సమస్యలున్న పిల్లలకు పూర్తి భరోసా
- డాక్టర్‌ అమరేశ్‌రావు, విభాగాధిపతి, కార్డియోథోరాసిక్‌ విభాగం, నిమ్స్‌

పుట్టుకతో గుండె జబ్బులున్న ఉన్న పిల్లలకు, ఇతర పేద రోగులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. నిమ్స్‌ ఆసుపత్రికి ప్రభుత్వం అందించే వివిధ పథకాలు, దాతలు అందించే నిధుల ద్వారా పేద పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్సలు అందుతాయి. పరికరాలను సమకూర్చడంలో సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ జూబ్లీహిల్స్‌, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు