logo
Published : 27 Jun 2022 02:43 IST

పెళ్లికి ఒప్పుకోలేదని.. బాలిక ఇంటి ఎదుటే బలవన్మరణం

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: తాను ఇష్టపడిన బాలికతో పెళ్లికి నిరాకరిస్తున్నారని.. ఓ యువకుడు ఆమె ఇంటి ముందే ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.ఎస్‌.రవి వివరాల ప్రకారం.. మైలార్‌దేవుపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జమాల్‌(21) ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌లోని దుకాణంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. సంబంధిత యజమాని కూరగాయలు, ఇతర వస్తువులు ఇచ్చి రావడానికి జమాల్‌ను తరచూ తన ఇంటికి పంపించేవాడు. ఈ క్రమంలో యజమాని కుమార్తె(16)పై ప్రేమ పెంచుకున్నాడు. విషయం తెలియడంతో యజమాని నాలుగు నెలల క్రితం అతడిని పనిలోనుంచి తొలగించాడు. రెణ్నెల్ల క్రితం జమాల్‌ తన తల్లిని యజమాని ఇంటికి తీసుకొచ్చి బాలికను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరగా.. ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. వారిపై కోపం పెంచుకున్న యువకుడు తరచూ బాలిక సహా కుటుంబీకులకు ఫోన్లు చేసి వేధిస్తుండగా.. వారు అతడిని తీవ్రంగా హెచ్చరించారు. బాలిక తండ్రి ఆదివారం రాత్రి జమాల్‌ సోదరుడు అర్షద్‌ను స్థానికంగా ఓ హోటల్‌కు పిలిపించి ఇదే విషయమై మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జమాల్‌ ఆటోలో గ్యాస్‌ సిలిండర్‌, డీజిల్‌ డబ్బాతో బాలిక ఇంటికి చేరుకున్నాడు. ఆమె కుటుంబం నివసిస్తున్న రెండో అంతస్తుపైకి వెళ్లి డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడంతోపాటు గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌ను ఆన్‌చేసి పెట్టటడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలకు తాళలేక జమాల్‌ మెట్లపై నుంచి పరుగెత్తుతుండగా కింద పడి తలకు గాయమైంది. సమాచారం అందుకున్న బాలిక తండ్రితోపాటు అర్షద్‌, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జమాల్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని