logo
Updated : 27 Jun 2022 12:53 IST

మూడుముళ్ల బంధం.. ముణ్నాళ్ల ముచ్చటేనా?!

ఈనాడు, హైదరాబాద్‌: పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండూ నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ గ్రేటర్‌లో  పలువురు పెళ్లైన కొద్ది నెలలకే భాగస్వామితో సరిపడటం లేదంటూ విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.  

నెలకు ఎన్ని కేసులంటే.. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, పురానీ హవేలీ, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ప్రతినెలా సగటున 250కిపైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. కౌన్సెలింగ్‌ సెంటర్లను ప్రతినెలా 10-15 మంది ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్థికపరమైన అంశాల్లో భిన్నాభిప్రాయాలుండటం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనారోగ్య సమస్యలు, అనుమానాలు విడిపోవడానికి ప్రధాన కారణాలు.

పెళ్లికి ముందే చెప్పడం లేదు.. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్న మహిళల్లో 20 శాతం వరకు పెళ్లైన తర్వాత ఉద్యోగాలు మానేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే డబ్బులు అవసరం అయినప్పుడల్లా భర్తను అడగాలంటే ఇబ్బంది పడుతున్న మహిళలు ఎందరో. తమ ఉద్యోగం, జీవిత లక్ష్యం తదితర భవిష్యత్‌ ప్రణాళికల గురించి పెళ్లికి ముందే కాబోయే జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా వివరించకపోవడంతో పెళ్లైన తర్వాత సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్య సమస్యలూ.. పెళ్లికి ముందు ఇరువురి అనారోగ్య సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేస్తుండటంతో తర్వాత విషయం తెలిసి వారి మధ్య తీవ్ర అగాధం ఏర్పడుతోంది. చివరికి విడిపోయేందుకు ప్రధాన కారణమవుతోంది. కాబోయే జీవిత భాగస్వామికి ఏవైనా జన్యుపరమైన సమస్యలేమైనా ఉన్నాయా.. లేవా అనేది ముందుగానే నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇవి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు సంక్రమించే అవకాశం ఉండొచ్చు. అలాగే వంధ్యత్వం, లైంగిక వ్యాధుల గురించీ విచారించాలని నిపుణులు చెబుతున్నారు.


పెళ్లికి ముందు కౌన్సెలింగ్‌ అవసరం
-జి.జ్యోతిరావు, అమికా మధ్యవర్తిత్వ కేంద్ర అధ్యక్షురాలు

ఒక మనిషి మరో మనిషిని అర్థం చేసుకోవడానికి సుమారు 6 నెలలు పడుతుంది. కానీ అంతలోపే విడాకులు కావాలంటూ అడుగుతున్నారు. నేను ఇప్పటివరకు 120 కేసుల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించాను. ఇందులో 70 శాతం కేసుల్లో అహమే కారణమైంది. పెళ్లి చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో వారికి స్వేచ్ఛనివ్వాలి. పెద్దల జోక్యమే సమస్యలకు దారి తీస్తోంది. ఇరువురి మధ్య చదువు, అంతస్తు, ఆర్థిక సంబంధాలు, సామాజిక స్థితి విడిపోవడానికి కారణమవుతోంది. పెళ్లికి ముందు ప్రేమ, రిలేషన్‌షిప్‌నకు సంబంధించి గతంలో అనుభవాలుంటే కాబోయే భార్య/భర్తకు ముందుగానే చెప్పాలి. పెళ్లి తర్వాత తెలిస్తే అపనమ్మకం ఏర్పడుతోంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని