logo

అందని వడ్ల దుడ్లు.. ‘వడ్డీ’లే ఆదరువు!

ఖరీఫ్‌ ప్రారంభమవుతుందంటే చాలు అన్నదాతల కష్టాలు చెప్పనలవికాదు. సకాలంలో అప్పులు పుట్టక, బ్యాంకర్లు సహకరించక, అమ్మిన ధాన్యం డబ్బులు కూడా చేతికందక అవస్థలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇతరుల వద్ద అప్పులు

Published : 27 Jun 2022 02:40 IST

పెట్టుబడులకు లేక అన్నదాతల ఆందోళన

న్యూస్‌టుడే, కొడంగల్‌, దౌల్తాబాద్‌, పరిగి

కొడంగల్‌లో ధాన్యంతో బారులు తీరిన ట్రాక్టర్లు

* దౌల్తాబాద్‌కు చెందిన హన్మయ్య గత నెల 24న 115 బస్తాల ధాన్యాన్ని దేవరపస్లాబాద్‌ మిల్లులో వేశారు. ఇందుకు గాను రూ.96 వేలు రావాలి. ఇప్పటివరకు నయాపైసా అందలేదు. నాలుగు ఎకరాల్లో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది.

* ఇదే మండల కేంద్రానికి చెందిన చంద్రప్ప 50 బస్తాలను 25రోజుల కిందట కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. సుమారు రూ.35 వేలు అందాల్సి ఉంది.

* దోమ మండలం బాసుపల్లికి చెందిన నరేష్‌ కౌలు రైతు. రెండెకరాల్లో వరి సాగు చేయడంతో పండిన 70బస్తాల ధాన్యాన్ని బొంపల్లి కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. రూ.54 వేలు రావాల్సి ఉంది. నెల రోజులు కావస్తున్నా జమకాలేదు. పెట్టుబడులకు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఖరీఫ్‌ ప్రారంభమవుతుందంటే చాలు అన్నదాతల కష్టాలు చెప్పనలవికాదు. సకాలంలో అప్పులు పుట్టక, బ్యాంకర్లు సహకరించక, అమ్మిన ధాన్యం డబ్బులు కూడా చేతికందక అవస్థలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లోగా ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ప్రజాప్రతినిధులను నుంచి అధికారుల వరకు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నెల రోజులు దాటుతున్నా అందడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలంలో పనుల్లో రైతులు తలమునకలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం డబ్బులు అందక ఆగమాగం అవుతున్నారు. అప్పు పుట్టడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఈరోజు రేపు ఖాతాల్లో జమ అవుతాయని అంటున్నారని వాపోతున్నారు.

108 కొనుగోలు కేంద్రాల ద్వారా
తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో డీసీఎమ్మెఎస్‌, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ విపణుల ఆధ్వర్యంలో మొత్తం 112 కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో 108 కేంద్రాల ద్వారా 18,068 మంది రైతుల నుంచి 76,122 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో మొదటి రకం 76,042 మెట్రిక్‌ టన్నులు, రెండవ రకం 80 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఇందులో ఏ గ్రేడ్‌కు రూ.1,960, ఉండగా బి గ్రేడ్‌కు రూ.1,940 చొప్పున మద్దతు ధరలను అందించింది.

ఆభరణాలను తాకట్టుపెట్టుకుని
గ్రామాల్లో నేటికీ వడ్డీ వ్యాపారం కొనసాగుతోంది. రూ.3 చొప్పున అప్పులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రధానంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని వడ్డీ ఇస్తున్నారు. అదును దాటితే విత్తనం విత్తుకున్నా అంతగా ప్రయోజనం ఉండదని అన్నదాతలు చెబుతున్నారు. అమ్మిన పంట డబ్బులు వెంటనే అందితే తమకు ఇలాంటి సమస్య చాలా వరకు ఉండదని అంటున్నారు.

అమలు కాని రుణమాఫీ
రుణమాఫీ అమలు కాకపోవడంతో వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. తొలిదశలో రూ.25వేలు, మలి విడతగా రూ.50వేల వరకు అప్పులున్న వారికి మాత్రం రుణమాఫీని వర్తింప జేసిన ప్రభుత్వం రూ.లక్ష ఏక మొత్తంగా ఉన్న వారికి మాత్రం ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీని కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ వర్తించినా కొత్త రుణం పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


గత నెల 24న విక్రయించా
తిరుపతిరెడ్డి, రైతు, దౌల్తాబాద్‌.

దౌల్తాబాద్‌ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారికి గతనెల 24న 55 క్వింటాళ్ల ధాన్యం విక్రయించా. నెల రోజులు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.2 చొప్పున అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ధాన్యం డబ్బులు వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.


రూ. 70 వేలు రావాల్సి ఉంది..
కృష్ణయ్య, చిన్ననందిగామ, కొడంగల్‌

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ధాన్యం అమ్మిన డబ్బులు చేతికందలేదు. 35 క్వింటాళ్లు విక్రయించా. దాదాపు రూ.70 వేలు రావాల్సి ఉంది. విత్తనాలు, ఎరువులకు రూ.3చొప్పున వడ్డీకి అప్పు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని