Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు

Updated : 27 Jun 2022 16:38 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను, ఆ తర్వాత సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలుర గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. నిందితులందరినీ మైనర్ బాలిక గుర్తించింది. బాధితురాలు తెలిపిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. 

మరోవైపు అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారి డీఎన్ఏ సేకరించడానికి అనుమతివ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, అందుకు అనుమతి లభించింది. నిందితుల డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. అత్యాచారం జరిగిందని పోలీసులు చెబుతున్న ఇన్నోవా వాహనంలో క్లూస్ టీం ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది. డీఎన్ఏ నివేదికతో ఇన్నోవా వాహనంలో దొరికిన ఆధారాలను పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారని పక్కాగా నిరూపించడానికి పోలీసులకు డీఎన్ఏ నివేదిక ఎంతో కీలకం కానుంది. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించేందుకు కోర్టు అనుమతి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనర్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నిందితులు విదేశాలకు పారిపోకుండా ముందస్తు జాగ్రత్తగా వారి పాస్‌పోర్టులను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని