Hyd News: వైద్యుల విందు.. కడుపులోనే కన్నుమూసిన పసికందు!

వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్‌ఘాట్‌ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం..

Updated : 28 Jun 2022 07:21 IST

చాదర్‌ఘాట్‌, న్యూస్‌టుడే: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్‌ఘాట్‌ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఆరిఫ్‌ భార్య సురయ్య ఫాతిమా(24) కాన్సు కోసం ఈనెల 24న చాదర్‌ఘాట్‌ అక్బర్‌ టవర్స్‌లోని ఇంతియాజ్‌ ఆసుపత్రిలో చేరింది. 26న సాయంత్రం 3 గంటలకు పురిటి నొప్పులు రావడం కోసం ఇంజెక్షన్‌ ఇచ్చారు. దాంతో ఆమెకు రాత్రి 9 గంటలకు నొప్పులు రావడంతో ఆ విషయం చెప్పడానికి కుటుంబ సభ్యులు వెళ్లగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కానరాలేదు. ఎక్కడికెళ్లారని పరిశీలించగా.. ఆసుపత్రి టెర్రస్‌పైన విందు ఏర్పాటు చేసుకొని.. మ్యూజిక్‌ సిస్టం పెట్టుకొని నృత్యం చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గంట తర్వాత విందు ముగించుకొని వచ్చిన వైద్యులు.. ఫాతిమాను పరీక్షించి కడుపులోని శిశువు మృతి చెందిందని వెల్లడించినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం చేయకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యజమానురాలు కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటంతో విందు ఏర్పాటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

ఆసుపత్రిని మూసేయాలి.. నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని వైద్యుల వద్దకు వెళ్లగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది అంతా పాటలు, నృత్యాలలో మునిగి తేలారు. గంట తరువాత వచ్చి చూసి కడుపులో బిడ్డ మృతి చెందింది.. ఆపరేషన్‌ చేసి తీసేయాలని చెప్పారు. ఇతర రోగులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఆసుపత్రిని మూసివేయాలి. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేస్తామని ఫాతిమా భర్త సయ్యద్‌ ఆరిఫ్‌ తెలిపారు.

యాజమాన్యంపై కేసు నమోదు.. బాధితురాలి భర్త ఆరిఫ్‌ ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. మృత శిశువును ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని