logo

ఆర్టీసీలో నమోదు కాని పాఠశాలలు

విద్యార్థుల బస్సు పాస్‌కు పాఠశాల, జూనియర్‌ కళాశాల, ఇంజినీరింగ్‌, మెడికల్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు టీఎస్‌ఆర్టీసీలో నమోదు కావాల్సి ఉంది. ఇప్పటికే నమోదైతే ఏటా పునరుద్ధరించుకోవాలి. అప్పుడే బస్సు పాస్‌లు జారీ అవుతాయి.

Published : 30 Jun 2022 03:32 IST

బస్సుపాస్‌కు నోచుకోని విద్యార్థులు

ఈనాడు - హైదరాబాద్‌

విద్యార్థుల బస్సు పాస్‌కు పాఠశాల, జూనియర్‌ కళాశాల, ఇంజినీరింగ్‌, మెడికల్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు టీఎస్‌ఆర్టీసీలో నమోదు కావాల్సి ఉంది. ఇప్పటికే నమోదైతే ఏటా పునరుద్ధరించుకోవాలి. అప్పుడే బస్సు పాస్‌లు జారీ అవుతాయి. కానీ అది జరగడం లేదు. ఫలితంగా విద్యార్థులు బస్సు పాస్‌లు తీసుకోలేకపోతున్నారు. బాల, బాలికలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు పాస్‌లను కూడా తీసుకోలేకపోతున్నారు. రూటు పాస్‌ తీసుకోడానికి కూడా ఇదే నిబంధన అడ్డురావడంతో పేదలపై భారం పడుతోంది.

నమోదు ముఖ్య ఉద్దేశం..

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ విద్యాలయం నమోదుకు సంబంధించిన కోడ్‌ నంబరును నింపాల్సి ఉంటుంది. ఆ నంబరు ప్రకారం ఆ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్లో విద్యాలయాలకు వెళ్తాయి. అక్కడి ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌ లేదా పరిపాలనాధికారి సంతకం చేసి తిరిగి పంపిన తర్వాతే టీఎస్‌ఆర్టీసీ విద్యార్థి బస్సు పాస్‌ జారీ అవుతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 7,400ల విద్యాసంస్థలున్నాయి. ఇలా 4900ల వరకూ ఇప్పటివరకూ టీఎస్‌ఆర్టీసీలో నమోదయ్యాయి. దీంతో 4 లక్షల వరకూ విద్యార్థులు ఈ ఏడాది బస్సు పాస్‌లు తీసుకున్నారు. మిగతావి దూరంగా ఉన్నాయి. దీంతో 2 లక్షలమంది బస్సు పాస్‌లకు దూరమయ్యారు.

నమోదుకయ్యే రుసుం స్వల్పమే..

పదోతరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు కొత్తగా టీఎస్‌ఆర్టీసీలో నమోదు కావాలంటే రూ.3 వేలు పరిపాలనాపరమైన ఫీజు చెల్లించాలి. గతేడాది ఈ మొత్తం చెల్లిస్తే.. పాతది పునరుద్ధరించాలంటే రూ.2 వేలు చెల్లిస్తే సరిపోతుంది. జూనియర్‌ కళాశాలలు రూ.4 వేలు, పాతది పునరుద్ధరించాలంటే రూ.3 వేలు చెల్లించాలి. అలాగే డిగ్రీ, పీజీ కళాశాలలు కొత్తగా నమోదు అవ్వాలంటే రూ.5 వేలు, పునరుద్ధరించాలంటే రూ.4 వేలు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంజినీరింగ్‌, వైద్యం, ఎంబీఏ వంటి కళాశాలలు కొత్తవి అయితే రూ.6వేలు, పునరుద్ధరించాలంటే రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. https://online.tsrtcpass.in వెబ్‌సైట్లో ‘అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీల వివరాలు’ ప్రకారం ఆయా విద్యాలయాలు రుసుం చెల్లించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని