logo

హ్యాపీ వీకెండ్‌.. హాయ్‌ బ్రో.. అంటే కొకైన్‌ సరఫరా!

‘‘హ్యాపీ వీకెండ్‌... హాయ్‌ బ్రో... హౌ ఫార్‌ యు’’ వంటి సంకేత పదాలతో కొకైన్‌ను సరఫరా చేస్తున్న రెండు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలను హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Updated : 30 Jun 2022 09:31 IST


అదుపులోకి తీసుకున్న డ్రగ్స్‌ ముఠా వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్‌ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘హ్యాపీ వీకెండ్‌... హాయ్‌ బ్రో... హౌ ఫార్‌ యు’’ వంటి సంకేత పదాలతో కొకైన్‌ను సరఫరా చేస్తున్న రెండు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలను హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురు ఆఫ్రికన్లు హెన్రీ చిగ్బో, అమోబీ ఛువుడీ, మథియాస్‌, యెమన్‌ దేశస్థుడు అహ్మద్‌ కమాల్‌లను బంజారాహిల్స్‌లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.13 లక్షల విలువైన కొకైన్‌, మెటా ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరి నుంచి డ్రగ్స్‌ తీసుకున్న 23 మందిని అరెస్టు చేయనున్నామని వివరించారు. కీలక నిందితుడు డివైన్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

గ్రాము రూ.10 వేలు.. : దిల్లీలో ఉంటున్న డివైన్‌ సుజీ.. విమానాలు, అంతర్జాతీయ కొరియర్ల ద్వారా మాదకద్రవ్యాలు కొకైన్‌, మెటా ఆంఫిటమైన్‌లను కిలోలకొద్దీ తెప్పిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పర్యాటక వీసాతో నైజీరియా, టాంజానియా నుంచి హెన్రీ చిగ్బో, అమోబీ, మథియాస్‌లు వేర్వేరుగా దిల్లీకి వచ్చారు. వీసా గడువు ముగిసినా వారు వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో ఉంటున్నారు. మూడేళ్ల నుంచి వీరు కొకైన్‌, మెటా ఆంఫిటమైన్‌లను డివైన్‌ సుజీ నుంచి కొద్ది మొత్తాల్లో దిల్లీ నుంచి తెచ్చి బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లో విక్రయిస్తున్నారు. హెన్రీపై బెంగళూరులో కేసులుండగా.. హైదరాబాద్‌ పోలీసులు రెండేళ్ల క్రితం అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలై దిల్లీకి పారిపోయాడు. అమోబీపై బెంగళూరులో ఒకటి, హైదరాబాద్‌లో రెండు కేసులున్నాయి. బెంగుళూరు పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మరో ముఠాకు చెందిన మథియాస్‌ నాలుగేళ్ల నుంచి చిన్న చిన్న నేరాలు చేస్తున్నాడు. మాస్కులు విక్రయిస్తానంటూ మోసం చేయగా పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చాక యెమన్‌ దేశస్థుడు అహ్మద్‌ కమాల్‌తో పరిచయమైంది. రెండేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి బెంగళూరులో ఉంటున్న ఇమ్మానుయేల్‌ నుంచి మెటా ఆంఫిటమైన్‌ను తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో గ్రాము రూ.10వేలకు విక్రయిస్తున్నారు.

* డ్రగ్స్‌ విక్రయాలు బయటపడకుండా చరవాణుల్లో యాప్స్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. స్నాప్‌చాట్‌ ద్వారా ‘‘హాయ్‌ బ్రో, హ్యాపీ వీకెండ్‌, హౌ ఫార్‌ యు, వెన్‌ కమింగ్‌’పేర్లను కొకైన్‌కు సంకేతాలుగా వినియోగిస్తున్నారు. ఈ సంకేతాల ద్వారా వీరు నాలుగైదు నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్నారు. స్నాప్‌చాట్‌లో సందేశాన్ని పంపితే.. రెండు, మూడు నిముషాల్లో అది రెండుఫోన్లలోనూ అదృశ్యమవుతుంది. దీంతో పోలీసులకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించవు.

* టోలీచౌకీలోని పారమౌంట్‌ కాలనీలో నివసిస్తున్న అమోబీకి డ్రగ్స్‌ వస్తున్నాయన్న సమాచారంతో హైదరాబాద్‌ మాదకద్రవ్యాల నిఘా విభాగం ఇన్‌స్పెక్టర్లు రాజేష్‌, రమేష్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున పారమౌంట్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్నారు. బెంగుళూరు నుంచి హెన్రీ చిగ్బో 20గ్రాముల కొకైన్‌ను తీసుకుని అమోబీకి ఇచ్చేందుకు రాగా రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మద్‌ కమాల్‌, మథియాస్‌లను కూడా పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని