logo

రైలెక్కాలంటే చెమట కక్కాల్సిందే

ఎంతో ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. స్టేషన్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒకటి, 10 నంబర్ల ప్లాట్‌ఫామ్‌ల మీదకు వచ్చే రైళ్లు తప్ప మిగతావేవి అందుకోవాలన్నా అవస్థలు పడుతున్నారు. లిఫ్టులున్నాయి. ఎస్కలేటర్లున్నాయి.. కాని అవి సక్రమంగా పని చేయడంలేదు. రెండు వారాల క్రితం జూన్‌ 17 రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంలో కొన్ని లిఫ్టులు, ఎస్కలేటర్లు దెబ్బతిన్నా.. వాటిని వెంటనే పునరుద్ధరించలేదు. అంతకుముందైనా అన్ని సక్రమంగా పనిచేసిన దాఖలాల్లేవు.

Updated : 30 Jun 2022 07:03 IST

సికింద్రాబాద్‌ స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌లు దాటాలంటే ఆపసోపాలు

విధ్వంసం తర్వాత పునరుద్ధరణ చర్యల్లోనూ జాప్యమే


సామాన్లతో మెట్లెక్కుతూ ప్రయాణికుల ప్రయాస

ఈనాడు, హైదరాబాద్‌: ఎంతో ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. స్టేషన్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒకటి, 10 నంబర్ల ప్లాట్‌ఫామ్‌ల మీదకు వచ్చే రైళ్లు తప్ప మిగతావేవి అందుకోవాలన్నా అవస్థలు పడుతున్నారు. లిఫ్టులున్నాయి. ఎస్కలేటర్లున్నాయి.. కాని అవి సక్రమంగా పని చేయడంలేదు. రెండు వారాల క్రితం జూన్‌ 17 రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంలో కొన్ని లిఫ్టులు, ఎస్కలేటర్లు దెబ్బతిన్నా.. వాటిని వెంటనే పునరుద్ధరించలేదు. అంతకుముందైనా అన్ని సక్రమంగా పనిచేసిన దాఖలాల్లేవు.

ఒకటి, పదిలో మాత్రమే లిఫ్టులు..

స్టేషన్లో మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఒకటి, పదిపైనే లిఫ్టులున్నాయి. ఒకటో ప్లాట్‌ఫామ్‌పై ఇరువైపులా ఉంటే.. ఒక్కటే పనిచేస్తోంది. పదో ప్లాట్‌ఫామ్‌పైనా రెండు ఉండగా.. ఒకటే పనిచేస్తోంది. ఈ లిఫ్టులు ప్రధాన ప్రవేశమార్గానికి దగ్గర్లో లేవు. ఏవైపు ఉన్నాయనే సూచికలూ లేవు. మొదటి ప్లాట్‌ఫామ్‌పై గణేష్‌ మందిరం వైపున్న లిఫ్టు పనిచేస్తున్నా అది ఎవరికీ కనపడని పరిస్థితి. దీంతో ప్రయాణికులు మెట్లు భారంగా ఎక్కుతూ అవస్థలు పడుతున్నారు.


మెట్ల మార్గంలో ఆయాసపడుతూ..

ఎస్కలేటర్లు ఎక్కడానికే..

స్టేషన్లో మూడు పాదచారుల వంతెనలున్నాయి. ఇందులో మధ్యలో ఉన్న పాదచారుల వంతెనకే అన్ని ప్లాట్‌ఫామ్స్‌కి చేరేలా ఎస్కలేటర్లున్నాయి. అవన్నీ ఎక్కేందుకు, దిగేందుకు రెండూ పక్కపక్కనే ఉండాల్సి ఉంది. 6, 7వ నంబరు ప్లాట్‌ఫామ్స్‌పైనే రెండు ఎస్కలేటర్లున్నాయి. ఇందులో ఒకటి ఎక్కడానికే ఉంది. పాదచారుల వంతెన నుంచి దిగేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ఎస్కలేటర్‌ పని చేయడంలేదు. ఇటీవల జరిగిన విధ్వంసంలో ఈ రెండు ఎస్కలేటర్లు దెబ్బతిన్నాయి. వీటిని పూర్వస్థితికి తేవడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారు.

నడకదారులు లేకుండా..

ఒకటి, పదో ప్లాట్‌ఫామ్స్‌పైకి దివ్యాంగులు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత 2-9వ ప్లాట్‌ఫామ్‌ పైకి చేరుకోవాలంటే.. వారి ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అక్కడే ఉన్న వీల్‌ఛైర్లతో ప్లాట్‌ఫామ్‌లకు చివర్లో సరకు రవాణాకు ఉద్దేశించి రైల్వే లైన్ల మీద నుంచి చదును చేసే ప్రాంతాల నుంచే కదలాలి. అప్పుడు రైళ్లు పట్టాలు దాటితే ప్రమాదకరంగా ఉంటుంది. ప్రతి ప్లాట్‌ఫామ్‌కు రైల్వే పాదచారుల వంతెన నుంచి వీల్‌ ఛైర్‌ దిగేందుకు అనువుగా నడకదారి నిర్మించాల్సి ఉంది.


* ఏ-1 స్టేషన్‌గా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు

* నిత్యం తిరిగే రైళ్లు: 236

* రాకపోకలు సాగించే వారు: 1.80 లక్షలు


* స్టేషన్‌కు దక్షిణాన ఇటీవల కొత్తగా నిర్మించిన వంతెనకు అన్ని ప్లాట్‌ఫామ్స్‌ని కలుపుతూ.. బయట నుంచి బయటకు వెళ్లేలా వెసులుబాటు ఉంది. ప్లాట్‌ఫామ్‌ ఒకటి వైపు (గణేష్‌ మందిరం వైపు) బయట నుంచి రెండు ఎస్కలేటర్లున్నాయి. ఇందులో ఒకటి ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఉన్నాయి. పదో ప్లాట్‌ఫామ్‌వైపు ఎస్కలేటరు లేదు.

* 2 - 3 ప్లాట్‌ఫామ్స్‌పై ఎక్కడానికే ఎస్కలేటర్‌ ఉంది.

* 4 - 5 పై ఎక్కడానికే ఉంది.

● 8 - 9 పై ఉన్నవి ఎక్కడానికే ఉన్నాయి.


గుండె ఆగినంత పని అవుతోంది

కళమ్మ, ప్రయాణికురాలు

లిఫ్టులు ఏవి పని చేస్తున్నాయో, ఎక్కడున్నాయో అర్థం కాదు. తీరా వెతుక్కుంటూ వెళ్తే అది పని చేయదు. మెట్లు ఎక్కితే.. ఆయాసంతో ప్రాణాలు పోయినంత పని అవుతోంది. గుండె దడ వచ్చేస్తోంది. సామాన్లతో, పిల్లాపాపలతో పాదచారుల వంతెనకు చేరుకుని మిగతా ప్లాట్‌ఫామ్స్‌కి వెళ్లడం ఎంత కష్టమో. ఈ అవస్థలు ఎన్నటికి తీరుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని