logo

ఆత్మ నిర్భర్‌ విశ్వాసం

చిరు వ్యాపారులకు రుణాలు మంజూరూ చేస్తూ.. వారి చింతలను తొలగిస్తూ ’ఆత్మనిర్భర్‌’ పథకం ఆదుకుంటోంది. మొదటి, రెండు, మూడు విడతలుగా వారికి రుణాలను అందిస్తుంది.

Published : 30 Jun 2022 02:28 IST

వీధి వ్యాపారులకు సహకారం

మూడో విడత రుణాల పంపిణీకి చర్యలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ


సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు

చిరు వ్యాపారులకు రుణాలు మంజూరూ చేస్తూ.. వారి చింతలను తొలగిస్తూ ’ఆత్మనిర్భర్‌’ పథకం ఆదుకుంటోంది. మొదటి, రెండు, మూడు విడతలుగా వారికి రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద అతి తక్కువ వడ్డీతో ఎటువంటి పూచికత్తు లేకుండానే ఇస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ఈ పథకాన్ని ప్రకటించి, కొనసాగిస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించటంతో వీరంతా ఆర్థికంగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా దీనిని కొనసాగిస్తున్నారు. మొదటి విడత 2020-2021 సంవత్సరానికి చెల్లింపులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. ఈ ప్రక్రియలో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానం, రాష్ట్రంలో జిల్లా అయిదో ర్యాంకులో నిలిచిందని మెప్మా అధికారులు వెల్లడించారు.

జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పురపాలికల్లో వీధి వ్యాపారులు చేసేకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. వీరి వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నారు. ఇందుకుగాను మెప్మా సిబ్బంది వివరాలను సేకరించి అర్హులను గుర్తించారు. వారికి రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు సిఫారసు చేయడంతో మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభాలో 5 శాతం వీధి వ్యాపారులను గుర్తించాలి. వీధి వ్యాపారుల కోసం వికారాబాద్‌లో ప్రత్యేకంగా 20 షెడ్లలను నిర్మించారు. వీటిని కేటాయించాల్సి ఉంది.


ఈ- శ్రమ్‌ కార్డు పంపిణీ

రెండో విడత సక్రమంగా చెల్లించిన వారికి..

హామీ పత్రాలు, పూచికత్తు లేకుండా కేవలం వెండర్‌ గుర్తింపు కార్డు అర్హతతో గతేడాది వ్యక్తిగత ఖాతాకు రూ.10 వేలు జమ చేశారు. ఏడాది కాలంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ విధంగా సకాలంలో చెల్లించిన వారికి వెంటనే రూ. 20 వేలు మంజూరు చేశారు. రెండో విడత 18 నెలల్లో చెల్లించిన వారికి మూడో విడత కోసం ఎంపిక చేస్తున్నారు. వీరికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. చాలా మంది వీధి వ్యాపారులు సకాలంలో రుణాలను చెల్లించి అర్హత సాధిస్తున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తే తగ్గింపు

రుణాన్ని అన్‌లైన్‌ ద్వారా చెల్లించినట్లయితే మొత్తంలో రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పించాయి. కొందరు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌పే, రూపే, గూగుల్‌పే వినియోగించినట్లు తెలిపారు.


బీమా సదుపాయం

రవికుమార్‌, మెప్మా జిల్లా అధికారి, వికారాబాద్‌

వీధి వ్యాపారులకు ప్రభుత్వం ఎన్నో రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. రెండో విడతలో పూర్తి కిస్తులు చెల్లించిన వారికి మూడో విడతగా రూ.50 వేలు మంజూరు చేస్తారు. స్వానిధి సమృద్ధి పథకం కింద బ్యాంక్‌ ద్వారా బీమా, ఫించన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కార్మికశాఖ ద్వారా ఈ- శ్రమ్‌ కార్డును పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ కార్డును అందజేస్తారు.


కొత్త వారిని గుర్తిస్తాం

వెంకటేశం, మెప్మా వికారాబాద్‌ పట్టణ అధికారి.

జిల్లా కేంద్రంలోని వీధి వ్యాపారులు రెండో విడత రుణ కిస్తులను సక్రమంగా చెల్లించాలి. కొత్త వారిని గుర్తించి బ్యాంకులకు సిఫారసు చేస్తాం. పట్టణానికి కొత్తగా వీధి వ్యాపారులు చేసుకునే వారు వస్తుంటారు ఈ లాంటి వారికి ఇది ప్రయోజనం. సైకిళ్లు, తోపుడు బండ్లు, రోడ్ల పక్కన చిన్న వస్తువులు అమ్మేవారిని పరిగణనలోకి తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని