logo

జల్‌పల్లి కమిషనర్‌కు రూ.కోట్లలో అక్రమాస్తులు

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై గురువారం అనిశా అధికారులు గురిపెట్టారు. ఆయన కార్యాలయం, రెండు ఇళ్లు,

Published : 01 Jul 2022 03:53 IST

మున్సిపల్‌ కార్యాలయం, ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు

ఈనాడు,హైదరాబాద్‌-జల్‌పల్లి, న్యూస్‌టుడే: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై గురువారం అనిశా అధికారులు గురిపెట్టారు. ఆయన కార్యాలయం, రెండు ఇళ్లు, హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11గంటల వరకూ సోదాలు కొనసాగాయి. అనిశా కేంద్ర పరిశోధన విభాగం డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయం, ఆదర్శ్‌నగర్‌లోని ఒక ఇల్లు, బాలాపూర్‌ వాసవీ కాలనీలోని ఇంట్లోంచి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ స్థానికంగా ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఓ ప్రజాప్రతిధి, అయన అనుచరులు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అక్రమాస్తుల వ్యవహారంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, వివరాలను శుక్రవారం అధికారికంగా వెల్లడిస్తామని డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

సతీమణి పేరుతో స్థిరాస్తి వ్యాపారం..!

ప్రవీణ్‌ కుమార్‌ తన సతీమణి పేరుతో ఓ రియల్‌ సంస్థను కొన్నేళ్ల క్రితం ప్రారంభించారని అనిశా అధికారులు గుర్తించారు. దీని ద్వారా రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహించారని తెలిసింది. దీనికి సరైన ఆధారాలు లేకపోవడంతో వారు ప్రవీణ్‌కుమార్‌ను ప్రశ్నించగా... సమాధానాలు చెప్పలేదు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ తన వ్యక్తిగత, అధికార వ్యవహారాలకు ఏకంగా తొమ్మిది మంది వ్యక్తిగత కార్యదర్శులను నియమించుకున్నారు. వీరిలో ఒక పీఏ గుత్తేదారుగా వ్యవహరిస్తున్నాడు. మరోముగ్గురు వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెడుతున్నారు. వీరికి జీతం కామాటి కార్మికుల పేర్లతో వస్తోంది. మరోవైపు అనిశా అధికారులు సమాచారం ఇవ్వడం లేదని పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు  గురువారం రాత్రి 10గంటలకు గేట్లు తోసుకుని వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనిశా అధికారులు సేకరించిన వివరాల మేరకు ప్రవీణ్‌ కుమార్‌ ఆస్తులు బహిరంగ మార్కెట్‌లో రూ.20కోట్లకు పైగా ఉంటాయని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని