logo

పేరుకే ‘ఆదర్శం’.. భోజనం అధ్వానం

మండలంలోని గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహణ కొరవడింది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో భోజన నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నీళ్ల చారు, ఉడకని అన్నం వడ్డిస్తున్నారు.  ఆహారం బాగా లేక

Published : 01 Jul 2022 03:53 IST

అర్ధాకలితో పిల్లల అవస్థలు
గొట్లపల్లిలో ఇదీతీరు

చిన్నారులకు వడ్డించిన..

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: మండలంలోని గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహణ కొరవడింది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో భోజన నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నీళ్ల చారు, ఉడకని అన్నం వడ్డిస్తున్నారు.  ఆహారం బాగా లేక పిల్లలు కడుపు కాల్చుకుంటున్నారు. అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. వంట నిర్వాహకులు ఏం వండితే అదే తినాలే అన్న విధానం సాగుతోంది. ప్రశ్నిస్తే ఎదురు తిరగడం మాములు తంతుగా మారింది. గురువారం ‘న్యూస్‌టుడే’ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉడకని అన్నం

మెనూ అమలు కాక..: పెద్దేముల్‌ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ అమలు కావడం లేదు. రోజు పప్పు చారు, నీళ్లతో కూడిన చారును వండి పెడుతున్నారు. ఆకలి చంపుకోలేక పిల్లలు దాన్నే తింటూ కాలం గడుపుతున్నారు. గురువారం మోను ప్రకారం కూరగాయలతో కూడిన కర్రీ చేయాలి. కానీ వంకాయ, అలుగడ్డ కలిపి నీళ్ల చారు చేసి పిల్లలకు పెట్టారు. ఉడకని అన్నం వడ్డించారు. కొందరు విద్యార్థులు దాన్ని తినలేక పారబోశారు. మరి కొందరు అతికష్టం మీద తీనేశారు. పూర్తి స్థాయిలో తినకపోవడంతో అన్నం మిగిలింది. కొన్నిసార్లు గుడ్డు ఇవ్వడంలేదు.

ఇళ్ల నుంచి తెచ్చుకుని..: గొట్లపల్లి వద్ద పెద్దేముల్‌ ఆదర్శ పాఠశాలకు వివిధ మండలాల నుంచి 426 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ చదవుకుంటున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు సైతం రోజు వచ్చిపోతున్నారు. వీరికి ప్రతి రోజు మధ్యాహ్నం పాఠశాలలోనే భోజనం వండి పెడుతున్నారు. ఆహారం సరిగా లేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. మిగతా విద్యార్థులు మాత్రం తప్పనిసరి పరిస్థితితో పాఠశాలలో వండిన ఆహారాన్నే తింటున్నారు. ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరిన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో వచ్చే వారు మధ్యాహ్న భోజనం సరిగా లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. రోజు అన్నం తినలేక పాడేస్తున్నారు. భోజనం సరిగా లేకపోవడం వల్ల పాఠాలు సరిగా వినడం లేదు. ఈ ప్రభావం చదవుపై పడుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.


అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం: గాయత్రి, ప్రిన్సిపల్‌
మధ్యాహ్న భోజనం సరిగా చేయాలని వంట నిర్వాహకులకు చెప్పాం. అయినా మార్పు రావడం లేదు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లాం. భోజనం విషయంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వాస్తమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని