logo

పనికి వెళ్తూ... పరలోకాలకు

కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలైన సంఘటన వికారాబాద్‌ మండలం గొట్టిముక్కల గేటు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పరిగి మండలం నస్కల్‌కు

Published : 01 Jul 2022 03:53 IST

కారు- బైక్‌ ఢీకొని ముగ్గురి మృతి
మృత్యువులోనూ వీడని స్నేహబంధం

వికారాబాద్‌, న్యూస్‌టుడే:  కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలైన సంఘటన వికారాబాద్‌ మండలం గొట్టిముక్కల గేటు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పరిగి మండలం నస్కల్‌కు చెందిన బోయిని మోహన్‌(45), మహమ్మద్‌ ఖాజామియా(49)  సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, బోయిని అంజయ్య(45) హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఉదయం 7 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గ్రామస్థులు ముగ్గురు మృత్యువాత పడటంతో ఊరంతా విషాదఛాయలు అలముకున్నాయి. వీరివి రెక్కాడితే గానీ డొక్కాడని నేపథ్యమున్న కుటుంబాలు. ఒకేచోట భవన నిర్మాణ(సెంట్రింగ్‌) కార్మికులుగా పని చేసేవారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిత్యం ముగ్గురూ పని కోసం ఒకే ద్విచక్ర వాహనంపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. రోజు మాదిరిగానే పని నిమిత్తం గురువారం బైక్‌పై వికారాబాద్‌ పట్టణానికి వస్తున్నారు. మార్గమధ్యంలోని గొట్టిముక్కల గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొని ఉసురు తీసింది. మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి శవాగారానికి తరలించి మరణోత్తర పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు మోహన్‌ పెద్ద కొడుకు సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.

దుబాయ్‌ వెళ్లి ఇంటి నిర్మాణం కోసం వచ్చి..
మృతుడు బోయిని మోహన్‌కు పెద్దల నుంచి సంక్రమించిన నాలుగెకరాల పొలం ఉంది. భార్య ప్రభావతి, కుమారులు సాయికుమార్‌(డిగ్రీ), వేణుకుమార్‌(ఇంటర్‌), నందిని (పదోతరగతి) సంతానం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఐదేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బు సంపాదించుకొని సరిగ్గా ఏడాది కిందట నస్కల్‌కు వచ్చాడు. నిర్మాణం పూర్తి కాగానే మళ్లీ వెళ్లి ఐదేళ్లు ఉండి వస్తానని గ్రామస్థులతో చెప్పేవాడు. పూర్తయ్యాక మరోమారు దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పరాయి దేశం వెళ్లి ఏకాకిగా బతికే బదులు ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చని నచ్చచెప్పడంతో... ఆ ఆలోచన విరమించుకొని భవన నిర్మాణ పనులకు వెళ్తున్నాడు.

అత్తగారింట్లో స్థిరపడి..:  మహమ్మద్‌ ఖాజామియాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి. పదిహేనేళ్ల కిందట నస్కల్‌కు చెందిన మైముదాబేగంతో వివాహమైంది. సొంత ఊళ్లో జీవనాధారం లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ అత్తగారింట్లోనే స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు సంతానం. అత్తమామలకూ ఆస్తిపాస్తులు లేకపోవడంతో నిత్యం వికారాబాద్‌, పరిగి ప్రాంతాలకు వెళ్లి పని చేసి కుటుంబాన్ని పోషించే వాడు. ఖాజామియా మృతితో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పెద్ద దిక్కును కోల్పోయి..: బోయిని అంజయ్యకు ఎకరన్నర పొలం ఉంది. భార్య శారదమ్మ, కొడుకు ప్రేమ్‌కుమార్‌(ఇంటర్‌) సంతానం. తొలకరి వర్షాలు కురియగానే ముగ్గురూ కలిసి పొలంలో విత్తనాలు నాటడం పూర్తి చేశారు. భార్య ఊళ్లోనే కూలికి వెళ్తుండగా, అంజయ్య భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు. ఇద్దరి సంపాదనతోపాటుగా పొలంపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవించే వారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భారమంతా భార్యపైనే పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని