logo

ఆనవాళ్లు కోల్పోయి.. నీళ్లు పారక!

నీటి వనరుల పునరుద్ధరణకు సర్కారు రూ.కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడంలేదు. దీంతో సాగు నీరందక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లాలోని మూడు ప్రధాన జలాశయాల వద్ద ఇదే దుస్థితి నెలకొంది.

Published : 01 Jul 2022 03:53 IST

అస్తవ్యస్తంగా మారిన కాలువలు

జుంటుపల్లి ప్రాజెక్టు వద్ద దుస్థితి

న్యూస్‌టుడే, తాండూరు: నీటి వనరుల పునరుద్ధరణకు సర్కారు రూ.కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడంలేదు. దీంతో సాగు నీరందక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లాలోని మూడు ప్రధాన జలాశయాల వద్ద ఇదే దుస్థితి నెలకొంది. కాల్వలు అస్తవ్యస్తంగా మారాయి. వీటికి వేసవిలో మరమ్మతు చేయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం భారీ వర్షాలు కురవడం లేదు, ఇప్పటికైనా పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయమై దృష్టి సారిస్తే ప్రయోజనముంటుంది. జలాశయాలు నిండగానే కాల్వల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు సాగు నీరు అందితే, రైతులు ఆరుతడి పంటలను ఇటు వానాకాలంలోనూ అటు యాసంగిలోనూ సాగు చేసి ఆర్థికంగా లాభపడతారు.

ప్రతిపాదనలకు మోక్షం లభిస్తేనే..
ధారూర్‌, పెద్దేముల్‌ మండలాల్లో 18 గ్రామాల పరిధిలోని 9,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించే విధంగా ధారూర్‌ మండలం నాగసమందర్‌, మండల కేంద్రం కోట్‌పల్లి గ్రామాల మధ్య 1750 ఎకరాల్లో 1967లో కోట్‌పల్లి జలాశయం నిర్మించారు. కుడి, ఎడమ కాలువలతో పాటు బేబీ కాలువ కలిపి 37.72 కిలోమీటర్ల పొడవునా నిర్మాణమయ్యాయి. మూడు దశబ్దాల వరకు కాల్వలు సవ్యంగా ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందింది. రైతులు వరి, వేరుసెనగ పంటలను సాగు చేసి రూ.కోట్లల్లో ఆర్జించారు. గత 25 ఏళ్ల నుంచి కాల్వల నిర్వహణ సవ్యంగా లేక శిథిల మయ్యాయి. ఫలితంగా నిర్ణీత ఆయకట్టులో కేవలం 3,500 నుంచి 4,000 ఎకరాలకే సాగు నీరు అందుతుంది. మిగతా ఆయకట్టులో వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సి వస్తోంది. కాల్వలను మరమ్మతు చేసేందుకు నీటి పారుదల శాఖ రూ.110 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాజాగా రూ.125 కోట్లు కావాలని అంచనా వేశారు. వీటిని మంజూరు చేస్తే పనులు జరుగుతాయి.

పూడిక నిండిన కోట్‌పల్లి జలాశయం కుడి కాలువ

జుంటుపల్లికి రూ.3 కోట్లున్నా..
యాలాల మండలం జుంటుపల్లి, అక్కంపల్లి, పేర్కంపల్లి, చెన్నారం, అగ్గనూరు, ఎన్కేపల్లి, బషీరాబాద్‌ మండలం కాశింపూరు గ్రామాల పరిధిలోని 2082 ఎకరాలకు సాగు నీరందించే జుంటుపల్లి జలాశయం కుడి, ఎడమ కాల్వలు పూర్తి అధ్వానంగా మారాయి. ఎక్కడికక్కడ కాల్వలు ధ్వంసమయ్యాయి. వీటి మరమ్మతుకు 2016లో ప్రభుత్వం రూ.1.45 కోట్లను మంజూరు చేసింది. పనులు మధ్యలోనే ఆగి పోయాయి. రెండోదశ మిషన్‌ కాకతీయ కింద 2016లో రూ.1.55 కోట్లు విడుదల చేశారు. పనులు ప్రారంభమైన మూడు నెలలకే ఆగి పోయాయి. నిధులు మాత్రం మూలుగుతున్నాయి. అందుబాటులో ఉన్న రూ.3 కోట్లతో కాల్వలను బాగు చేస్తే మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. ప్రస్తుతం 800 నుంచి 1,200 ఎకరాల వరకు మాత్రమే అతికష్టంగా సాగు నీరు అందుతుంది. మిగిలిన ఆయకట్టులో రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసి నష్టాలకు గురవుతున్నారు.

సర్పన్‌పల్లికి రూ.20 లక్షలు కావాలి
వికారాబాద్‌ మండలం సర్పన్‌పల్లి జలాశయం కాలువలు కూడా అధ్వానంగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో 3000 ఎకరాల ఆయకట్టు ఉంది. కేవలం 1000 ఎకరాల నుంచి 1200 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతుంది. కాల్వల మరమ్మతుకు నీటి పారుదల శాఖ రూ.20 లక్షలు కావాలని ఏడాది కిందట ప్రతి పాదనలు పంపించింది. నిధులు మంజూరు చేస్తే పనులు జరుగుతాయి. కాల్వలు బాగు పడతాయి. ఆయకట్టు మొత్తానికి  సాగు నీరు అందుతుంది.


నిధులు మంజూరైతే పనులు చేస్తాం

సుందర్‌, జిల్లా నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు, వికారాబాద్‌
కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల కాల్వల మరమ్మతుకు ప్రస్తుతం నిధులు లేవు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్నవాటిని  మంజూరు చేస్తే టెండర్లు నిర్వహించి పనులు చేపడతాం. జుంటుపల్లి వద్ద పనులు చేపట్టేందుకు కొన్ని నిధులు ఉన్నా సాంకేతిక పరమైన కారణాలు తలెత్తుతున్నాయి. పనులు చేపట్టాల్సిన గుత్తేదారు మృతి చెందారు. కొత్త వారికి అప్పగించాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరాం. వారి నుంచి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని