logo

జైల్లో దొంగలకు బెయిలిప్పించి చోరీలకు ప్రోత్సాహం

జైల్లో ఉన్న దొంగలకు బెయిలు ఇప్పించి మరీ చోరీలు చేయిస్తూ తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కథనం ప్రకారం..

Published : 01 Jul 2022 03:53 IST

నాగోలు, న్యూస్‌టుడే: జైల్లో ఉన్న దొంగలకు బెయిలు ఇప్పించి మరీ చోరీలు చేయిస్తూ తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కథనం ప్రకారం.. కడపలోని అశోక్‌నగర్‌కు చెందిన బ్రహ్మదేవర రాజశ్రీ గణేష్‌(37) అక్రమ సంపాదన కోసం క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడ్డాడు. ఇది తెలిసి అతని అన్న మందలించడంతో నగరానికి వచ్చి రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం చేశాడు. సినిమా మోజులో కృష్ణానగర్‌కు చేరుకున్నాడు. అక్కడ డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్న కడపకే చెందిన ఓ నేరస్థుడితో స్నేహం చేశాడు. సులువుగా సంపాదించేందుకు ఇద్దరూ కలిసి చోరీల బాట పట్టారు. 2012 నుంచి చోరీలకు అలవాటు పడ్డ గణేష్‌ గతంలో రాష్ట్రంలోని 13 ఠాణాల పరిధిలో, ఇతర రాష్ట్రాల్లోని 17 చోట్ల చోరీలకు తెగబడ్డాడు. పలుమార్లు జైలుకు వెళ్లి సుమారు 10 మంది మెరికల్లాంటి నేరస్థులను బెయిలుపై రప్పించి చోరీలు చేయించాడు. తాజాగా కడపలో ధనుంజయ్‌ అనే నిందితుడి సాయంతో జగన్నాథం అనే నేరస్థుడికి బెయిలు ఇప్పించి హైదరాబాద్‌లోని మేడిపల్లి, ఎల్బీనగర్‌, బంజారాహిల్స్‌, కర్నాటకలోని బళ్లారి, ప్రొద్దుటూరులో చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది మార్చి నెలలో ధనుంజయ్‌ను అరెస్టు చేసిన ఎల్బీనగర్‌ పోలీసులు... తప్పించుకు తిరుగుతున్న గణేష్‌ కోసం నిఘా పెట్టారు. గురువారం ఖైరతాబాద్‌లోని ఓ ఇంట్లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.1 లక్ష నగదు, 3 తులాల బంగారం, 22 తులాల వెండి, 2 ద్విచక్రవాహనాలు, 8 ఖరీదైన చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడు చోరీలకు విరామం ఇచ్చిన సమయంలో తిరుపతికి వెళ్లి వ్యభిచారం నిర్వహిస్తూ అలిపిరి పోలీసులకు చిక్కాడు. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, డీఐ ఉపేందర్‌రావు, ఎస్సై నరేందర్‌ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని