logo

వృత్తి వైద్యం.. ప్రవృత్తులెన్నో..!

నగరానికి చెందిన కొందరు ప్రముఖ వైద్య నిపుణులు తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన వ్యాపకానికి సమయం కేటాయిస్తూ ఆ రంగంలోనూ ప్రతిభ చూపుతున్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం

Published : 01 Jul 2022 03:53 IST

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి చెందిన కొందరు ప్రముఖ వైద్య నిపుణులు తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన వ్యాపకానికి సమయం కేటాయిస్తూ ఆ రంగంలోనూ ప్రతిభ చూపుతున్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.


కళాకారుడు.. ఫొటోగ్రాఫర్‌
కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ సైక్రియాటిస్ట్‌ డాక్టర్‌ చరణ్‌తేజ్‌ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు రెండు రకాల హాబీలను అలవాటు చేసుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఉండగా డిప్రెషన్‌కు లోనైనప్పుడు.. వైద్యులను సంప్రదించగా, సృజనాత్మకమైన హాబీ ఏదైనా ఉంటే మానసిక ఒత్తిడి దూరమవుతుందని చెప్పారు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం ఉండటంతో.. దాన్నే హాబీగా అలవాటు చేసుకున్నారు. ఆయనలో ఉన్న మూడో కోణం.. ఫొటోగ్రఫీ. తండ్రికి ఉన్న ఆసక్తి తనకు అలవడిందని అంటున్నారు. ఎక్కడకెళ్లినా నచ్చిన చిత్రం బంధించేందుకు అందుబాటులో కెమెరాను దగ్గరుంచుకుంటారు.


పక్షులంటే ప్రాణం
పక్షులంటే ప్రాణంపెట్టే గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ నిసర్గ. ఆయన కొండాపూర్‌ కిమ్స్‌లో కార్డియో థొరాసిక్‌ సర్జన్‌. ఇది ఒత్తిడితో కూడుకున్న వృత్తి. ఆపరేషన్‌ టేబుల్‌ మీద ఎప్పుడూ రక్తాన్ని చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. అలాంటప్పుడు చాలా సహనం, ఓపిక ఉండాలి. కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో కార్డియోథొరాసిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ నిసర్గకూ ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటినుంచి బయటపడటానికి ఆయన ఎంచుకున్న మార్గం. లాక్‌డౌన్‌ నుంచి పక్షుల ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నారు. తన ఇంటి చుట్టూ ఉన్న 30 రకాల పక్షులతో మొదలు కొని అరుదైన ఈజిప్షియన్‌ గద్ద, యురేషియన్‌ కుకూ వరకు అనేక రకాల పక్షుల చిత్రాలను బంధించారు. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీలో యూకేలోని ఓ సంస్థ నుంచి పురస్కారం అందుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా మంజీరా, ఉస్మాన్‌సాగర్‌, అమీన్‌పూర్‌ చెరువు, అనంతగిరి కొండల్లోకి కెమెరా పట్టుకుని వెళ్లిపోతుంటారు.


28ఏళ్లుగా శారీరక దారుఢ్యంలో శిక్షణ
ప్రఖ్యాత బోన్‌ ట్యూమర్‌ సర్జన్‌, అమోర్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి కిశోర్‌రెడ్డి. ప్రతి నెలా కనీసం 100 సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. రోజూ వందల మంది రోగులు ఆయన్ని సంప్రదిస్తుంటారు. దీంతో ఏకాగ్రతకు 28 ఏళ్లుగా ఆయన శారీరక దారుఢ్యంలో శిక్షణ పొందుతున్నారు. తనకు నీరసంగా అనిపించిన ప్రతిసారీ, ఒత్తిడి నుంచి ఊరట పొందేందుకు ఒకటి లేదా రెండు గంటలు జిమ్‌కు వెళ్తుంటారు. వ్యక్తిగత జిమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.


పాటలు పాడటం.. సైక్లింగ్‌ చేయడం
యశోద ఆస్పత్రిలో సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ అశ్విన్‌ తుముకూరు పాటలు పాడటం..సుదూర ప్రాంతాలకు సైక్లింగ్‌ చేయడం హాబీగా మార్చుకున్నారు. పాడటంతో పాటు వాటిని స్టార్‌మేకర్‌ లాంటి యాప్‌లలో రికార్డు చేయడం మొదలుపెట్టారు. దాని సాయంతో లోపాలను క్రమంగా సవరించుకుని.. మరింత నైపుణ్యం సాధించారు. తర్వాత ఒక మ్యూజిక్‌ ఛానల్‌ ప్రతినిధి ఈయనలాంటి మరికొందరు ఔత్సాహిక గాయకులను ఒకచోట చేర్చి, పాటలు రికార్డు చేశారు. ప్రతి ఆదివారం ఆ ఛానల్లో తమ కార్యక్రమం ఉంటుందని, ఇది చూసి తమ కుటుంబసభ్యులు కూడా ప్రోత్సహించారని చెప్పారు.

 


15 ఏళ్లుగా నామమాత్రపు రుసుం

కేపీహెచ్‌బీలో నాగయ్య క్లినిక్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ చుట్టుపక్కల వాసులకు డాక్టర్‌ నాగయ్య సుపరిచితులు. జనం మెచ్చిన వైద్యుడు ఈయన. 15 ఏళ్లుగా నామమాత్రపు రుసుంతో వెద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించి పదవీ విరమణ పొందాక కేవలం రూ.20కే వైద్యం అందించారు. కొన్నాళ్లకు రూ.10, ఇటీవలే రూ.10 పెంచి ప్రస్తుతం రూ.40కే వైద్యసేవలు అందిస్తున్నారు. వయసు పెరుగుతున్నా.. పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరొచ్చినా ఓపికగా వారి అనారోగ్యం గురించి తెలుసుకుని ముందులు రాసి ఎలా వాడాలో ఓపికగా చెప్తుంటారు. ఎంతమంది వచ్చినా ఆయన ముఖంలో విసుగు కనిపించదు. ఈయన ఒక్కరోజు క్లినిక్‌ మూసేస్తే రోగులు పెద్దసంఖ్యలో వచ్చి తిరిగి వెళ్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని