Bhatti Vikramarka: మోదీజీ... తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు: భట్టి విక్రమార్క

ఏపీ విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగలేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించి 8 ఏళ్లు అవుతున్నా..

Published : 02 Jul 2022 02:04 IST

హైదరాబాద్‌: ఏపీ విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగలేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించి 8 ఏళ్లు అవుతున్నా.. అందులోని హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత కూడా ఇప్పటివరకు హామీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లినా.. ఏ ఒక్క సభలోనూ హామీల గురించి ప్రస్తావించలేదన్నారు. పార్లమెంట్‌లో, బయట.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు.

తల్లిని చంపి పిల్లను బతికించారంటూ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పట్ల ప్రధానికి ఉన్న వ్యతిరేకత ఏమిటో స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని అంశాలను తక్షణమే అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని భట్టి తన లేఖలో కోరారు. ప్రధానంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఐటీ, ఐఐఎంలు, నిజామాబాద్‌ పసుపుబోర్డు  ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాయితీ, నవోద పాఠశాలల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పన, ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లాంటి వాటిని లేఖలో ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఐటీఐఆర్‌ రద్దు చేయడంతో లక్షలాది మంది తెలంగాణ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని, ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని