Telangana News: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెరాస

భాగ్యనగరంలో రహదారులపై ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

Updated : 22 Nov 2022 16:19 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో రహదారులపై ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భాజపా, తెరాస శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం మొదలైంది. తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటే.. మావి తొలగిస్తున్నారంటూ ఇరుపార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. 

నెక్లెస్‌రోడ్‌లో యువజ కాంగ్రెస్‌ ఆందోళన..

ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ భాజపా, తెరాస జెండాలు ఏర్పాటు చేయడంతో శుక్రవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ ఇతర పార్టీల జెండాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. యువజన కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జెండాలు తొలగించారు.

సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేసిన తెరాస నేతలు..

యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను భాజపా కార్యకర్తలు చింపేస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్‌విప్‌ బాల్క సుమన్‌ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. ఓఆర్‌ఆర్‌పై తమ ఫ్లెక్సీలను చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గచ్చిబౌలీలో సైబరాబాద్‌ సీపీని కలిసిన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బాల్క సుమన్‌ ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చింపేసిన ఫొటోగ్రాఫ్‌లను సీపీకి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని