logo

కమలంతోటి..కారు పోటీ

మహానగరం రెండు రోజులపాటు ప్రధాన పార్టీల రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారబోతోంది. నగరానికి ఒక వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. లక్షలమందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించబోతోంది. మరోవైపు ప్రతిపక్షాల

Published : 02 Jul 2022 02:04 IST

కాషాయం, గులాబి రంగులద్దుకున్న నగరం

హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నాగలిని

తిలకిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చిత్రంలో లక్ష్మణ్‌, తరుణ్‌ఛుగ్‌, బండి సంజయ్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మహానగరం రెండు రోజులపాటు ప్రధాన పార్టీల రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారబోతోంది. నగరానికి ఒక వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. లక్షలమందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించబోతోంది. మరోవైపు ప్రతిపక్షాల తరఫున దేశ ప్రథమ పౌరుడి అభ్యర్థిగా బరిలో నిల్చిన యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో కాకుండా ఇతర రోజుల్లో ఇలా రాజధానిలో రెండు పార్టీలు భారీ కార్యక్రమాలను నిర్వహించడం అరుదు. ఈ రెండు రోజుల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

అతిరథులంతా ఇక్కడే..

గచ్చిబౌలి నొవాటెల్‌లో శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. వీటి ప్రారంభానికి ముందే అంటే శనివారం ఉదయం భాజపా పదాధికారుల సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం నుంచి జరిగే కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీతోతోపాటు కేంద్రానికి చెందిన 45 మంది మంత్రులు, 14 మంది ముఖ్యమంత్రులతోపాటు ఇతర కీలక నేతలు పాల్గొనబోతున్నారు. దీంతో గచ్చిబౌలి ప్రాంతంలో పూర్తిస్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇదే సమయంలో శనివారం రోజే తెరాస కూడా బలప్రదర్శనకు సిద్ధమైంది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నగరానికి రాబోతున్నారు. బేగంపేట విమానాశ్రయానికి సిన్హా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11 గంటల తర్వాత రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మందితో భారీ ర్యాలీగా నెక్లెస్‌రోడ్డు వరకు వచ్చి అక్కడ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి నగరమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేలాది మందితో ప్రదర్శనకు సిద్ధమయ్యారు. దీంతో శనివారం బేగంపేటతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. తమ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కావాలనే తెరాస ఈ ర్యాలీ ఏర్పాటు చేసిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేదని ముందస్తు నిర్ణయం మేరకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెరాస నేతలు చెబుతున్నారు.

తెరాస నేతలకు భయపడొద్దు: కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర: రాష్ట్రంలో రోజురోజుకు పార్టీ బలపడుతుండటంతో బలహీనం చేసేందుకు తెరాస నేతలు బెదిరింపులకు గురిచేయడంతోపాటు ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస నేతల బెదిరింపులకు భయపడవద్దని, ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. శుక్రవారం బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో గ్రేటర్‌ పరిధిలోని కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో భాజపాలోకి వచ్చినప్పటికీ టికెట్లు ఇవ్వడంతో పాటు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే .. పార్టీ మారడం బాధాకరమన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్‌కుమార్‌, పలు జిల్లాల అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, వి.పాండుయాదవ్‌, బి.శ్యామ్‌సుందర్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డి, సామ రంగారెడ్డి, హరీశ్‌రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

నెక్లెస్‌రోడ్డులో తెరాస, భాజపా పక్కపక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, కటౌట్‌

అమర వీరుల చిత్రపటాలకు నివాళి అర్పిస్తున్న జేపీ నడ్డా

అతిథులకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిత్రంలో బండ కార్తికరెడ్డి

పరేడ్‌ మైదానంలో జాగిలాలతో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని