logo

సర్కారు డీలా.. ప్రైవేటు భళా!

పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు డీలా పడ్డాయి. సర్కారు బడుల కంటే ప్రైవేటు విభాగంలోని పాఠశాలల్లోనే అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఉత్తీర్ణత శాతం సైతం ఎక్కువగానే

Published : 02 Jul 2022 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు డీలా పడ్డాయి. సర్కారు బడుల కంటే ప్రైవేటు విభాగంలోని పాఠశాలల్లోనే అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఉత్తీర్ణత శాతం సైతం ఎక్కువగానే ఉంది. ప్రైవేటు పాఠశాలలు రంగారెడ్డి జిల్లాలో 93.66, మేడ్చల్‌లో 90.18, హైదరాబాద్‌ 80.87 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

పర్యవేక్షణ కొరవడి..

ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కడికక్కడ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న విమర్శలున్నాయి. జిల్లా అధికారులు పట్టించుకోక విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే విషయంపై ఉపాధ్యాయులు చొరవ తీసుకోలేదు. పరీక్షలకు ఎక్కువ సమయం లభించినా..సద్వినియోగం చేసుకోలేకపోయారు. రంగారెడ్డి జిల్లాలో సర్కారు బడుల్లో 72.60, మేడ్చల్‌ జిల్లాలో 57.89, హైదరాబాద్‌ జిల్లాలో 66.14 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ‘‘గతంలో హైదరాబాద్‌ జిల్లాలో యోగితా రాణా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. విద్యార్థులకు స్నాక్స్‌ వంటివి అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈసారి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షలు లేవు.. క్షేత్రస్థాయిలో ప్రత్యేక తరగతుల తీరును పర్యవేక్షించిందీ లేదు. ఉపాధ్యాయులు సైతం చొరవ తీసుకోకపోవడంతో ఫలితాలు తక్కువగా వచ్చాయి.’’ అని హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర జిల్లాల్లో పరీక్షల సమయంలో కాస్త చూసీచూడనట్లు ఉంటారు. నగరంలో తనిఖీ బృందాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉండటంతో పరీక్షలు పకడ్బందీగా జరుగుతాయి’ .. ప్రతికూల ఫలితాలు రావడానికి ఇదో కారణమని మరో ఉపాధ్యాయుడు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని