logo

డిప్యుటేషన్‌పై వచ్చి.. చక్రం తిప్పుతూ..

 ప్రత్యర్థుల అవినీతి ఆరోపణలపై ఏసీబీ వలలో చిక్కిన జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ను గురువారం అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో జల్‌పల్లి పురపాలికలో కొందరు అధికారుల

Published : 02 Jul 2022 02:04 IST

జల్‌పల్లి పురపాలికలో కొందరు ఉద్యోగుల లీలలు

జల్‌పల్లి పురపాలిక కార్యాలయం

జల్‌పల్లి, న్యూస్‌టుడే:  ప్రత్యర్థుల అవినీతి ఆరోపణలపై ఏసీబీ వలలో చిక్కిన జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ను గురువారం అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో జల్‌పల్లి పురపాలికలో కొందరు అధికారుల లీలలపై ఒక్కొక్కటిగా ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి.

కమిషనర్‌ అండతో..

కోదాడ, పూర్వపల్లి, షాద్‌నగర్‌ తదితర పురపాలికల్లో పనిచేసిన ఓ సీనియర్‌ ఉద్యోగి కొన్ని నెలల పాటు విధులు నిర్వహించడం ఆపై అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురవడం పరిపాటిగా మారింది. ఈయన ఐదేళ్ల క్రితం జల్‌పల్లి పురపాలికకు డిప్యుటేషన్‌పై వచ్చాడు. కమిషనర్‌ ప్రవీణ్కుమార్‌ ఆయనకు వెన్నుదన్నుగా నిలవడంతో ఇక్కడే స్థిరపడిపోయారు. అదే సమయంలో అప్పటి మేనేజర్‌ అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ ఆయ్యారు. అప్పటి నుంచి ఈ సీనియర్‌ ఉద్యోగి కమిషనర్‌ అండతో ‘మేనేజర్‌ పాత్ర’ నిర్వహించాడు. ఈయన సీసీ కెమెరాలు లేని గదులకు పిలిచి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు కాంట్రాక్టు ఉద్యోగినులు ఆరోపించారు. కమిషనర్‌ది సైతం ఇదే తీరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటి పనులకు రావాల్సిందే..

ఈ సీనియర్‌ ఉద్యోగి ఇంటి పనులకు నిత్యం నలుగురు వెళ్లాల్సిందేనని పారిశుద్ధ్య మహిళా కార్మికులు ఆరోపించారు. ఒక్క రోజు వెళ్లకపోయినా హాజరు పట్టీలో గైర్హాజరు నమోదు చేస్తాడని పేర్కొన్నారు. ఏకంగా కామాటి కార్మికుల జాబితాలో అసలు పనులు చేయని 14మంది పేర్లున్నాయి. వీరిలో 9మంది కమిషనర్‌కు సహాయకులుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురి ఊరు పేరు ఎవరికీ తెలియదు. అయినా ప్రతీ నెలా వారి పేర్లతో జీతాలు బ్యాంకు నుంచి డ్రా అవుతాయి. ఈ సీనియర్‌ ఉద్యోగిపైనా ఏసీబీ అధికారులు దాడులు చేయాలని వారు కోరుతున్నారు. కమిషనర్‌పై దాడి సందర్భంగా ఏసీబీ అధికారులు ఈ సీనియర్‌ ఉద్యోగి గురించి ఆరా తీయగా.. తనకు కరోనా సోకిందని తెలిపినట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని