logo

కొరవడిన నిఘా..యథేచ్ఛగా దగా

చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ, కర్ణాటకకు తరలిస్తున్న లారీని కొడంగల్‌ పోలీసులు జూన్‌ 6న పట్టుకున్నారు. ఇందులో 250 క్వింటాళ్లున్నాయి.

Published : 02 Jul 2022 02:04 IST

సరిహద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం

వికారాబాద్‌లో స్వాధీనం చేసుకున్న ట్రాలీ

చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ, కర్ణాటకకు తరలిస్తున్న లారీని కొడంగల్‌ పోలీసులు జూన్‌ 6న పట్టుకున్నారు. ఇందులో 250 క్వింటాళ్లున్నాయి.

గత నెలలో కొడంగల్‌లో 51 క్వింటాళ్లతో తరలిస్తున్న డీసీఎం వ్యానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దోమ మండలం మోత్కూరులో నిల్వ చేసిన 35 క్వింటాళ్లు టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధి అనంతగిరి సమీపంలో ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 22 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5న 16క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో వికారాబాద్‌ నుంచి పటాన్‌చెరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌, మున్సిపాలిటీ

దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు చేపడుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అయితే అమలులో లోపాలు తలెత్తడంతో అవి పక్కదారి పడుతున్నాయి. వెరసి లక్ష్యం అభాసుపాలవుతోంది. ఇందుకు ఉదాహరణగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న రేషన్‌ బియ్యం. జిల్లాలో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వందల క్వింటాళ్ల కొద్దీ బియ్యం పక్కదారి పడుతున్నప్పటికీ పకడ్బందీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఓవైపు పంపిణీ అవుతుండగా మరోవైపు పట్టుబడటం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. దొరికితేనే దొంగ అన్న చందంగా చాప కింద నీరులా వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది. తాండూరు, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌లోనూ దందా జోరుగా జరుగుతోంది. బియ్యాన్ని సేకరించి కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 588 రేషన్‌ దుకాణాలున్నాయి. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆయా దుకాణాల పరిధిలో 2,34,940 రేషన్‌ కార్డులున్నాయి. సుమారు 9వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని నేరుగా అర్ధరాత్రి సమయంలో రైసు మిల్లులకు చేరవేస్తున్నారు. వాటిని మరాడించి మార్పు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ పేదలను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు.

ఆరు నెలల్లో 69 కేసులు

అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నా కఠినచర్యలు మాత్రం కనిపించడం లేదు. ఈఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 69కేసులకు పైగా నమోదయ్యాయి. 1087.42 క్వింటాళ్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వ్యవహారం ఎలా నడుస్తుందో ఇట్టే తెలిసిపోతోంది. ఒకే తీరు అక్రమాలకు పాల్పడుతూ మూడు అంతకన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే సదరు అక్రమార్కులపై పీడీ చట్టం నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కరిపైనా ఇలాంటివి నమోదు కాలేదు. దొరుకుతున్న వారిపై 6ఏ కేసులు నమోదు చేసి వదిలేయడంతో అక్రమ వ్యాపారం సజావుగా సాగిపోతోంది.

ఊరూవాడా సేకరణ

కొంతమంది ప్రత్యేకంగా గ్రామాల్లో బియ్యం పంపిణీ జరుగుతున్న సమయాల్లో తిరుగుతున్నారు. అల్లం అమ్మకాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటింటా ఆటోల ద్వారా సేకరించి తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అధికారులు పల్లెల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అక్రమార్కుల ఆట కట్టించవచ్చని పలువురు చెబుతున్నారు.

వినియోగదారులు విక్రయించినా తప్పే: రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్రమ బియ్యం రవాణాను అరికడతాం. గ్రామాల్లో నిఘా మరింత పెంచుతాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే క్రమంలో రేషన్‌ దుకాణాల పనితీరును పరిశీలిస్తాం. వినియోగదారులు ఇతరులకు విక్రయించినా అది తప్ఫే ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

దోమలో పట్టుబడిన..​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని