Cm Kcr: హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారని..

Updated : 02 Jul 2022 17:26 IST

హైదరాబాద్: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారని.. రెండు రోజులు ఇక్కడే ఉంటారన్నారు. తెరాస వేసే ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు నా హృదయపూర్వక స్వాగతం. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలకపాత్ర. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉంది. మంత్రిగా దేశానికి అనేక సేవలు చేశారు. న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా ఉత్తమ సేవలు అందించారు. ఆత్మప్రభోదానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి. అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది’’ అని సీఎం అన్నారు.

వారికి సాయం చేస్తే భాజపా చులకనగా చూసింది..

‘‘మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. టార్చిలైట్‌ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్‌ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు. వాటిపై రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. ఉద్యమంలో కొందరు రైతులు మృతి చెందారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షలు అందించాం. వారికి సాయం చేస్తే భాజపా చులకనగా చూసింది. ఉద్యమిస్తున్న రైతులపై జీపుతో ఎక్కించారు. రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులు అన్నారు. మోదీ పాలనలో దేశ  ప్రతిష్ఠను మసకబారేలా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రధానిగా కాకుండా.. దేశానికి సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. మార్పు వచ్చి తీరుతుంది’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?

‘‘ద్రవ్యోల్బణం పెరిగింది.. జీడీపీ పడిపోయింది. మోదీతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే దోషిగానే చూడాల్సి వస్తుంది. మోదీ తీరుతో శ్రీలంక ప్రజలు నిరసనలు తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారిపోయింది. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?మేము మౌనంగా ఉండం.. పోరాటం చేస్తాం. మేక్‌ ఇన్‌ ఇండియా అనేది శుద్ధ అబద్ధం. మోదీ ప్రధానిగా కాదు.. దోస్త్‌ షావుకారు కోసం సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారు. మోదీ పాలనలో అంతా తిరోగమనమే. మోదీ.. ఎంత నల్లధనం వెనక్కి తెచ్చారో చెప్పాలి. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపు అయింది. ఇదేనా వికాసం? అవినీతి రహిత భారత్‌ అని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగారు. మోదీ పాలనలో అన్నీ స్కామ్‌లే. నల్లధనం తీసుకొచ్చి రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామన్నారు. ఏ ఒక్కరి ఖాతాల్లోనైనా రూ.15 లక్షలు పడ్డాయా? మోదీ.. దోస్తులకే తప్ప ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు’’ అని కేసీఆర్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని