BJP: హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో హెచ్‌ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు భాజపా

Updated : 02 Jul 2022 17:39 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో హెచ్‌ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు భాజపా సిద్ధమైంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు.. వాటితో పాటు ఇకపై అధికారం కొనసాగించాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించనున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి అనే నినాదాన్ని హైదరాబాద్‌ వేదికగా ఇవ్వడానికి కాషాయ దళం సిద్ధమైంది. 

దీంతో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విషయాలపై జాతీయ కార్యవర్గం చర్చించనుంది. ఇవాళ సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన కార్యవర్గం సమావేశం రాత్రి 9 గంటల వరకు.. మళ్లీ రేపు ఉదయం 10గంటల ప్రారంభమై సాయంత్రం 3గంటల వరకు నిర్వహించాలని సమయం కేటాయించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడున్న 119 నియోజకవర్గాల్లో పర్యటించిన నేతల అభిప్రాయాలను కార్యవర్గం తెలుసుకోనుంది. రేపు సాయంత్రం విజయ సంకల్ప సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభ ద్వారా తెరాస విమర్శలను తిప్పికొట్టే అవకాశముంది. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధిపై చర్చించి... రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భాజపా పాలిత 18 రాష్ట్రాల సీఎంలు, 348 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 3గంటల వరకు హెచ్‌ఐసీసీలో  జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని