Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో రేవంత్‌రెడ్డి

Published : 03 Jul 2022 01:28 IST

హైదరాబాద్‌: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య మరోసారి వార్‌ మొదలైంది. 

ఏం జరిగిందంటే?

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కలిసేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ను కలవాలనుకున్నా.. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని స్పష్టం చేశారు. యశ్వంత్‌ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరారు.. మద్దతిచ్చాం అని రేవంత్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వచ్చిన యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని మీడియా పీసీసీ దృష్టికి తీసుకురాగా.. రేవంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ మద్దతు కోసం హైదరాబాద్‌ వచ్చిన సిన్హాను కలవకూడదని ఏఐసీసీ అనుమతితో నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. 

రాహుల్‌గాంధీకి క్షమాపణ చెబుతా.. పార్టీ వీడను: జగ్గారెడ్డి

అయితే, ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా బండకేసి కొడతానని చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓర్పు లేని వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉండటానికి అర్హుడు కాదని తేల్చి చెప్పారు. 4నెలలుగా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడకుండా ఉన్నానని, ఇప్పుడు రేవంత్‌రెడ్డే తనను రెచ్చగొట్టాడని మండిపడ్డారు. రేవంత్‌ను పీసీసీ పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. యశ్వంత్‌ సిన్హాను కలవాలి, కలవకూడదని పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ వచ్చిన తర్వాత పార్టీకి ఒరిగిందేమీ లేదని, ఆయన లేకపోయినా పార్టీని నడిపిస్తామని స్పష్టం చేశారు. ఆయనొక్కడే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాడా? అని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. యశ్వంత్‌ సిన్హాను సీనియర్‌నేత వీహెచ్‌ కలవడంలో తప్పులేదన్న జగ్గారెడ్డి.. వీహెచ్‌ అంటే తెలియదని పీసీసీ అధ్యక్షుడు ఎలా అంటారని ప్రశ్నించారు. పార్టీలో ఉన్న వారంతా పాలేర్లు కాదని, అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో చేరికల విషయంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్కను డమ్మీ చేసి.. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్‌ గాంధీకి మాట ఇచ్చానని, ఆయన మాట తప్పినందుకు రాహుల్‌కు క్షమాపణలు చెబుతానన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని