logo

నేడే విజయ సంకల్పం.. భద్రత పటిష్ఠం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు సజావుగా ప్రారంభమవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ.. ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌భవన్‌ బస..

Published : 03 Jul 2022 03:19 IST

పరేడ్‌ మైదానంలో సభికుల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక షెడ్డు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు సజావుగా ప్రారంభమవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ.. ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌భవన్‌ బస.. హైదరాబాద్‌ పర్యటన పూర్తి వంటి అంశాలపై దృష్టి సారించారు. శనివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకూ మొత్తం 36 గంటలు ప్రధాని మోదీ సహా ప్రముఖుల భద్రతలపైనే పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ అధికారులతో హైదరాబాద్‌్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని బస, పరేడ్‌ మైదానంలో బహిరంగ సభ తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలిసింది. జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న అగ్రనేతలు తరలిరావడంతో వారి భద్రతను సమీక్షించారు.
హెలికాప్టర్‌లో బేగంపేటకు..
సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం సాయంత్రం జరగనున్న విజయ సంకల్ప సభను పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశాలున్నాయి. అంతకుముందు ఆయన హెచ్‌ఐసీసీ నొవాటెల్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. రూఫ్‌టాప్‌ బందోబస్తు, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, సీసీ కెమెరాలు ఇలా నాలుగంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఎస్పీజీ బృందాలు బహిరంగ సభ ప్రాంగణం, సభా వేదికను తమ ఆధీనంలోని తీసుకున్నాయి. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులకు ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించాయి.
రాజ్‌భవన్‌ మార్గంలో రాకపోకలు బంద్‌
విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించిన తర్వాత పరేడ్‌ మైదానం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి 9 నుంచి 10 గంటల్లోపు ఎప్పుడైనా రాజ్‌భవన్‌కు చేరుకొనే అవకాశాలున్నాయన్న అంచనాతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు సాధారణ ప్రజలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని