BJP: వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు: రవిశంకర్‌ ప్రసాద్‌

హెచ్‌ఐసీసీ వేదికగా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి.

Published : 04 Jul 2022 01:41 IST

హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీ వేదికగా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. ‘‘దేశానికి భాజపా అవసరం గురించి కార్యవర్గ సమావేశాల్లో మోదీ సవివరంగా చెప్పారు. సర్దార్‌ పటేల్‌ విశాల భారతదేశాన్ని కాంక్షించారు. పటేల్‌  కృషి వల్లే భారత్‌లో తెలంగాణ విలీనమైంది. బంగాల్‌, కేరళలో భాజపా శ్రేణులపై దాడులు జరిగాయి. కేరళ, తెలంగాణలో మా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌, సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌  మన నినాదమని మోదీ చెప్పారు. సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దారిలో ఉన్నాయి. కరోనా రూపంలో అందరికీ పెద్ద సవాల్‌ ఎదురైంది. కానీ, ప్రధాని మోదీ దూరదృష్టితో సవాలును అధిగమించాం. వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశ వ్యాప్తంగా భాజపా విస్తరిస్తోంది. దేశంలో సర్వజనహితం కాంక్షించి పాలన సాగిస్తున్నాం’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు.

తెలంగాణలో మంచి కార్యక్రమానికి  ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. రెండ్రోజులుగా నియోజకవర్గాల్లో భాజపా ముఖ్యనేతలు ప్రజల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు పరిశీలించారని తెలిపారు. ఎస్సీ వాడలకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలనేది ప్రధాని ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని మోదీ ఆకాంక్షించారని తెలిపారు. గిరిజన మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని మోదీ నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూ వివిధ రంగాల్లో అనుభజ్ఞురాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా రాష్ట్ర భాజపా నేతలు హెచ్‌ఐసీసీలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ పోరాటం, భాజపా తెలంగాణ చరిత్ర తెలిపేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఇప్పటికే పలువురు నేతలు సందర్శించారు. సమావేశాలకు విచ్చేసిన ముఖ్య నాయకులంతా ఎగ్జిబిషన్‌ను తిలకించాలని రాష్ట్ర నేతలు కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని