PM Modi: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌

Updated : 03 Jul 2022 20:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభ(vijaya sankalpa sabha)లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెరాసను ఉద్దేశించి ఎలాంటి విమర్శలు చేయని ప్రధాని .. ఎనిమిదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగం కొనసాగించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఏ పనులు చేస్తామో వివరించారు. తెలంగాణలో 35వేల కోట్ల విలువైన 5 భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

‘‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చేస్తాం. 8 ఏళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం. దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను భాజపా నెరవేర్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం. కరోనా కష్టకాలంలో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మంచి ఫలితాలు వచ్చాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆశీర్వదించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ అందరికీ గర్వకారణం’’ అని మోదీ అన్నారు.

తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం..

‘‘ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయి. మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర పెంచాం. రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోంది. భాగ్యనగరంలో అనేక పై వంతెన(ఫ్లైఓవర్లు)లు నిర్మించాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చా’’ అని మోదీ అన్నారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...

‘సోదర సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘‘ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్టు ఉంది. హైదరాబాద్‌ నగరం అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోంది. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలం. తెలంగాణ పవిత్ర భూమి. దేశ ప్రజలకు యాదాద్రి నరసింహస్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి’’ అని మోదీ అన్నారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా,  రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పలువురు రాష్ట్ర నేతలు సభకు హాజరయ్యారు. చిరు జల్లులు పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భాజపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విజయసంకల్ప సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను చూసి... బండి సంజయ్‌ను మోదీ అభినందించారు. విజయ సంకల్ప సభ వేదికగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భాజపాలో చేరారు. అమిత్‌ షా సమక్షంలో జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి విశ్వేశ్వర్‌రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించారు. ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ.. సభా ప్రాంగణం నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే ప్రధాని బస చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని