logo

వ్యవసాయ విపణికి.. ఇక మహర్దశ

 జిల్లాలో రోజూ వారీగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే తాండూరు విపణికి ఇక మహర్దశ కలగ నుంది. దశాబ్దాల తరబడి ఇరుకు విపణిలో కొనసాగుతున్న కార్యకలాపాలు విశాలమైన స్థలంలో కొనసాగేందుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం విస్తరణకు

Published : 04 Jul 2022 03:57 IST

30 ఎకరాల్లో జరగనున్న విస్తరణ

తొలగనున్న వ్యాపారులు, రైతుల ఇక్కట్లు

స్థలం సరిపోక విక్రయాల సమయంలో ఇలా..

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో రోజూ వారీగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే తాండూరు విపణికి ఇక మహర్దశ కలగ నుంది. దశాబ్దాల తరబడి ఇరుకు విపణిలో కొనసాగుతున్న కార్యకలాపాలు విశాలమైన స్థలంలో కొనసాగేందుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం విస్తరణకు అవసరమైన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తాజా పరిస్థితితో ఇటు రైతులు అటు వ్యాపారులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

1969లో ఏర్పాటు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న తాండూరు నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా 1969 జులై 6న తాండూరు కేంద్రంగా 3 ఎకరాల విస్తీర్ణంలో విపణిని ఏర్పాటు చేసింది. అప్పట్లో రైతులు ఉత్పత్తులను విక్రయానికి గ్రామాల నుంచి ఎడ్లబండ్లపై క్వింటాళ్లలోనే తరలించేవారు. అప్పటి అవసరాలకు విపణి స్థలం సరిపోయింది. కాలక్రమేణా వర్షాధారం పంటల స్థానే బోరు బావుల ఆదారంగా పంటల సాగు విస్తరించింది. ఒకప్పుడు ఏడాది పొడవునా రూ.లక్షల్లో విలువచేసే ఉత్పత్తులు విక్రయమైన స్థానే రెండు దశాబ్దాల నుంచి రూ.వందల కోట్ల విలువ చేసే ఉత్పత్తులు విక్రయానికి వస్తున్నాయి. ● ప్రస్తుతం ప్రత్యేక శ్రేణిగా ఉన్న విపణిలో తాండూరు నియోజకవర్గంలోని రైతులే కాకుండా వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గ రైతులతో పాటు కర్ణాటక రాష్ట్ర గ్రామాల్లోని రైతులు ఉత్పత్తులను విక్రయించడానికి రావడంతో మూడెకరాల స్థలం సరిపోక పూర్తిగా ఇరుకుగా మారింది. స్థలా భావం వల్ల రైతులు ఉత్పత్తులు అమ్మకం కాకుంటే రహదారులుగా వారగా నిల్వ చేసి వెళతారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఉత్పత్తులు తడిసి నాణ్యత దెబ్బతినడంతో ఆశించిన ధర రాక ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తోంది. ● ఉన్నతాధికారులు విపణి విస్తరణకు 20 ఎకరాల నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటూ చాలా సార్లు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా ప్రభుత్వం భూమిని కేటాయించడంతో ఏళ్లుగా ఎదురైన ఇబ్బందులు దశల వారీగా పరిష్కారం కానున్నాయి.


అన్నిరకాల అనుకూలం

కొత్త స్థలంలో రైతులు ఉత్పత్తులను తరలించడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. వాహనాలను నిలువ రించడానికి విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండవు. వ్యాపారులకు అవసరమైన దుకాణాల సముదాయాన్ని కావాల్సిన ఆకారాల్లో నిర్మించవచ్ఛు ఉత్పత్తులను ఆరబెట్టడానికి, గుమ్మరించడానికి విశాలమైన యార్డులను ఏర్పాటు చేసుకోవచ్ఛు.

* ఏటా రూ.300 కోట్ల విలువ చేసే కందులు, పెసలు, మినుములు, శనగలు, వేరుసెనగలు, మొక్కజొన్నలు, పసుపు, సోయాబిన్‌, కుసుమలు, ధాన్యం వంటి తదితర ఉత్పత్తులను రైతులు విక్రయిస్తారు. విశాలమైన స్థంలో ఈ-నామ్‌ అమలు జరిగితే ఉత్పత్తుల అమ్మకాల విలువ రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.


పక్కాగా ఈ-నామ్‌ అమలు

వ్యవసాయ విపణికి స్థలం కేటాయించడంతో ఇక జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ (ఈ-నామ్‌) పక్కాగా అమలు కానుంది. ఆరేళ్ల కిందట ప్రారంభమైన ఈ-నామ్‌ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న మూడెకరాల స్థలంలో చోటు సరిపోక విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కుప్పలుగా పోసే పరిస్థితి లేదు. దీంతో ఇతర రాష్ట్రాల ట్రేడర్లు ఆన్‌లైన్‌ పద్ధతిలో కొనుగోలు చేయడం లేదు. స్థానిక ట్రేడర్లు కేవలం బస్తాల్లో నింపిన ఉత్పత్తుల నమూనాలను పరిశీలించి కొనుగోలు చేయడంతో ఆశించిన స్థాయిలో ధరలు లభించడం లేదు. స్థలాన్ని కేటాయించడంతో ఈ-నామ్‌ కార్యకలాపాలు సాఫీగా సాగిపోనున్నాయి.


ధికారుల నిర్ణయం మేరకే పనులు చేపడతాం

- రాజేశ్వరి, కార్యదర్శి, వ్యవసాయ విపణి, తాండూరు

తాండూరు వ్యవసాయ విపణి విస్తరణను ఉన్నతాదికారుల నిర్ణయం మేరకు చేపడతాం. విపణి ఖాతాలో ఉన్న రూ.4కోట్లను విస్తరణ పనులకు వినియోగించే అవకాశం ఉంది. ఇందుకు ఉన్నతాదికారులు నిర్ణయం తీసుకోగానే పనులు ప్రారంభమౌతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని