logo

ఖర్చు చేయక... రూ.3.24 కోట్లు వెనక్కి..!

 జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పాఠశాల ఖాతాలో మూలుగుతున్న నిధులను, మార్చిలో చివర్లో జమ చేసిన నిధులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కి పంపాలని నెల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 04 Jul 2022 03:57 IST
పాఠశాల గ్రాంటు, ఇతర నిధులను తీసుకున్న విద్యాశాఖ

వికారాబాద్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పాఠశాల ఖాతాలో మూలుగుతున్న నిధులను, మార్చిలో చివర్లో జమ చేసిన నిధులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కి పంపాలని నెల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యాశాఖ అధికారులు రూ.3.24 కోట్లను వెనక్కి పంపారు. అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

విద్యార్థుల సంఖ్యే ఆధారం

* జిల్లాలో 156 ఉన్నత, 118 ప్రాథమికోన్నత, 748 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటికి ప్రతి ఏడాది విద్యాశాఖ పాఠశాల గ్రాంటు పేరుతో నిధలు విడుదల చేస్తుంది. 1 నుంచి 20 మంది విద్యార్థులుంటే రూ.12,500లు, 20-250 మందికి రూ.25000, ఇక 251-500 మంది వరకు రూ.50000, తరువాత 501-750 మంది విద్యార్థుల వరకు రూ.75000, అలాగే 751పైన ఉన్న పాఠశాలలకు లక్ష రూపాయలు ప్రతి ఏడాది పాఠశాలలకు కేటాయిస్తున్నారు. వీటితో పాటు సివిల్‌ వర్క్స్‌, ఇతర పనులకు నిధులు విడుదల చేస్తారు.

ఏళ్లుగా పడి ఉన్నాయని...

నాలుగు సంవత్సరాలుగా సివిల్‌ వర్క్స్‌కు సంబంధించిన నిధులు, రెండు సంవత్సరాలకు సంబంధించిన నిధులు వినియోగించని పాఠశాలలకు గ్రాంటు మొత్తాలు ఖాతాలో పడి ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఈ మొత్తానికి బ్యాంకు నుంచి వడ్డీ కూడా జమచేస్తారు. ఈ లెక్కన జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలిపి రూ.3.24 కోట్లు ఉన్నట్లు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. వీటిని జమ చేసి పదిహేను రోజుల క్రితం విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ఏళ్లుగా ఉన్నా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధిక పాఠశాలల్లో వినియోగానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ ఛైర్మన్లు, సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.

మార్చిలో వేశారు. అప్పుడే తీసేసుకున్నారు

జిల్లాలోని అనేక పాఠశాలలో పాఠశాల గ్రాంటులను ఖర్చు చేయలేకపోయారు. ఇక 2021-2022 సంవత్సరానికి సంబంధిన గ్రాంట్‌ను మార్చి నెల చివర్లో ఖాతాలో జమ చేశారు. మార్చి చివర్లోనే వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. సరైన సమయం లేక వీటిని ప్రధానోపాధ్యాయులు వినియోగించలేదు. దీంతో అధికారులు వీటిని కూడా లాగేసుకున్నారు.

నిర్వహణ కష్టం

2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల గ్రాంటు ఇంకా విడుదల చేయలేదు. ఈ గ్రాంటు సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్‌లో మొదటి విడత, మార్చిలో రెండో విడత ఇస్తారు. విద్యా సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేయడంతో కొన్ని పాఠశాలల్లో ఖర్చు చేయలేకపోతున్నారు. నిధులు వచ్చిన తరువాత తీసుకోవచ్చులే అని ముందుగా ప్రధానోపాధ్యాయుల సొంత డబ్బలు వెచ్చిస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత వాటిని తీసుకోవాలని అనుకుంటే కొందరు ఎస్‌ఎంసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


తిరిగి జమచేస్తారన్నారు

- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

వెనక్కి తీసుకున్న పాఠశాల గ్రాంట్‌ నిధులను తిరిగి పాఠశాల ఖాతాలో జమ చేస్తామన్నారు. వినియోగానికి నోచని రూ. 3.24 లక్షలను 15 రోజుల క్రితమే వెనక్కి పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ ఏడాది సంబంధించిన పాఠశాల గ్రాంటును విడుదల చేయాలని ఉన్నతాధికారులను కోరాం.


సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది

- కె. చంద్రశేఖర్‌, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

ఏటా రూ.50000 గ్రాంటు మదన్‌పల్లి పాఠశాలకు వస్తుంది. ఈసారి నా సొంత డబ్బులతో బడిబాట కార్యక్రమానికి అవసరమైన సామగ్రిని తెప్పించాం. అలాగే ఇతర ఖర్చులకూ సొంతగా చెల్లించాను. మార్చి చివర్లో నిధులు ఖాతాలో జమ చేశారు. ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు సెలవులిచ్చారు. నిధులను ఖర్చు చేసే సమయం ఎక్కడుంది. ప్రభుత్వం పునరాలోచించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని