logo

పోలీసుల సమన్వయం.. సభ ప్రశాంతం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. కర్ణాటక, అసోం, హరియాణా ముఖ్యమంత్రులు..

Published : 04 Jul 2022 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. కర్ణాటక, అసోం, హరియాణా ముఖ్యమంత్రులు.. జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్న కేంద్ర, రాష్ట్రాల మంత్రులు.. జాతీయ.. రాష్ట్రస్థాయి నాయకులు, వేలమంది కార్యకర్తలు హాజరైన విజయ సంకల్ప సభ ప్రశాంతంగా పూర్తయ్యింది. ఇందుకు9 హైదరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు తెరవెనుక భారీ కసరత్తే చేశారు. ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి అర్ధరాత్రి వరకూ ప్రధానమంత్రి మోదీ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ అధికారులు, కేంద్ర నిఘావర్గాలతో నిత్యం సంప్రదించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ రాక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీవీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బహిరంగసభకు అమిత్‌షా సహా కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఒకరి సమయం మరొకరికి ఇబ్బంది కాకుండా ఎస్పీజీ అధికారులతో మాట్లాడి వేర్వేరు సమయాలను కేటాయించారు. బహిరంగ సభా ప్రాంగణం, వెలుపల అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ స్వయంగా సభావేదిక పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా లోపల, వెలుపల జరుగుతున్న సంఘటనలన పరిశీలించారు. నలుగురు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు సభలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయంగా వెంటనే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని