logo

పరేడ్‌ మైదానం.. కాషాయమయం

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభ సందర్భంగా ఆదివారం ఆ పరిసరాలు కాషాయమయంగా మారాయి. వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు భాజపా జెండాలు, భారీ పతాకాలు, పార్టీ కండువాలు ధరించి బహిరంగ సభాస్థలి చుట్టూ జై శ్రీరామ్‌..

Updated : 04 Jul 2022 17:09 IST

మధ్యాహ్నం నుంచే తరలిన నాయకులు కార్యకర్తలు

సభలో శ్రేణుల ఉత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభ సందర్భంగా ఆదివారం ఆ పరిసరాలు కాషాయమయంగా మారాయి. వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు భాజపా జెండాలు, భారీ పతాకాలు, పార్టీ కండువాలు ధరించి బహిరంగ సభాస్థలి చుట్టూ జై శ్రీరామ్‌.. జైమోదీ... భారత్‌ మాతాకీజై అంటూ నినదించారు. దూరప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కార్యకర్తలు మధ్యాహ్నం ఒంటి గంటకే చేరుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మధ్యాహ్నం 2.30 గంటల తర్వాతే పోలీసులు వారిని అనుమతించారు. ఇక హెచ్‌ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జాతీయ, రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రులు నేరుగా బహిరంగ సభకు చేరుకున్నారు. ప్రధాని రోడ్డు మార్గంలో రాజ్‌భవన్‌కు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో.. తర్వాతే నాయకులు, కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు.

సికింద్రాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్‌ వైపు, సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. బేగంపేట, సీటీసీ పైవంతెనను మూసేశారు. ప్రగతిభవన్‌ ఎదురు నుంచి పైవంతెన పైకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలు, పరేడ్‌ మైదానం పరిసరాల్లో వాహనాలపై రాకపోకలను నిలిపేశారు.

మైదానం వెలుపల కమలోత్సాహం

సాయంత్రం ఐదు గంటల్లోపే పరేడ్‌ మైదానం కార్యకర్తలతో నిండిపోయింది. నగరం నలుమూలల నుంచి భారీగా తరలిన కార్యకర్తలు సీటీసీ పైవంతెన, పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాల్లో బయటే వేచి ఉన్నారు. ముఖ్య నేతల ప్రసంగాలప్పుడు జైమోదీ.. జై శ్రీరాం.. భారత్‌మాతాకీ జైఅంటూ నినాదాలతో హోరెత్తించారు.


మోదీకి కావాలనే తెరాస ఉచిత ప్రచారం: కేఏ పాల్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మోదీ నగర పర్యటనలో కావాలనే తెరాస ఉచిత ప్రచారం కల్పిస్తోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ విమర్శించారు. మోదీని చూసి తెరాస నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అమీర్‌పేట అపరాజితకాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో కేఏ పాల్‌ మాట్లాడారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం బాధ్యతగా వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలన్నారు. మోదీని కలవకుండా సాకులు చెపుతున్నారన్నారు. మోదీ వచ్చారు.. వెళ్తారని ఇందుకు రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే ప్రతీ ప్రాజెక్ట్‌లో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. భాజపా, తెరాస ఇచ్చిన హామీలను నెరవేర్చాయని అనుకుంటే తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.


విధుల్లో ఉండగా వైద్యుడి అరెస్టు

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో విధులో ఉన్న డాక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈయన గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా. విధులు ముగించుకొని వస్తానన్నా వినకుండా పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. నగరానికొస్తున్న ప్రధాని నరేంద్రమోదీని కలుస్తాం. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై కలిసి చర్చిస్తాం.. అవసరమైతే నిరసన చేపడతామని లంబాడీ హక్కుల ఐక్యవేదిక ద్వారా డాక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌ ప్రకటించారు. అందుకే ముందస్తు అరెస్టు చేసినట్లు నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మా గొంతు నొక్కినంత మాత్రాన ఉద్యమం ఆగదన్నారు.


అక్కరకు రాని పాస్‌లు.. ఆగిపోయిన నేతలు

ఈనాడు,హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా బహిరంగ సభకు హాజరయ్యేందుకు నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన పాసులు అక్కరకు రాకుండా పోయాయి. పాసులపై ఉన్న నంబరు గేట్‌నుంచే లోపలికి అనుమతించాలంటూ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఉండటంతో..ఇతర గేట్ల ద్వారా వచ్చిన నాయకులు, కార్యకర్తలకు నిరాశే కలిగింది. చివరకు సాధారణ కార్యకర్తలు వెళ్లిన ప్రవేశద్వారం నుంచే లోపలికి వెళ్లారు.

జిల్లాల నుంచి..

భాజపా నాయకులు రాష్ట్ర నలుమూలల నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను తరలించారు. యువకులు, దివ్యాంగులు, వృద్ధులను వాహనాల్లో తరలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జల్లాల నుంచి ఎక్కువమంది కార్యకర్తలు, నాయకులు పరేడ్‌ మైదానానికి తరలొచ్చారు. సాయంత్రానికే సభాస్థలి నిండిపోయింది.


భాజపా సభకు గద్దర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజా గాయకుడు గద్దర్‌ ఆదివారం భాజపా విజయ సంకల్ప సభకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వచ్చానని, ఇతరత్రా మరే కారణాలు లేవని మీడియాకు వివరించారు. గతంలో తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభకు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.


నేతలంతా సమావేశాల్లోనే బిజీ

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కీలక నేతలు రెండో రోజు ఆదివారం పూర్తి బిజీగా గడిపారు. ఉదయం నుంచే సమావేశాలు ప్రారంభం కావడంతో అక్కడికే పరిమితమయ్యారు. తొలిరోజు బయట కొంత సందడి కనిపించినా.. రెండో రోజు ఆ పరిస్థితి లేదు. పాసులున్న నాయకులనే అనుమతించడంతో పాసులు లేని రాష్ట్ర, జిల్లా నాయకులు సైతం బయటే ఉండిపోయారు.


బీజేవైఎం కార్యకర్తల వాలంటీర్‌ సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దసంఖ్యలో కార్యకర్తల రాక.. అందర్నీ అదుపు చేయాలంటే పోలీసులతోనే వీలుకాని పరిస్థితి.. ఇలాంటి సమయంలో బీజేవైఎం కార్యకర్తలు ప్రత్యేక సేవలు అందించారు. ఎవరికి కేటాయించిన గ్యాలరీల్లో వారు చేరుకునేలా తోడ్పాటు అందించారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపు చేస్తూ, ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 650 మంది బీజేవైఎం కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేస్తూ గ్యాలరీల వద్ద నిల్చుని సభ సజావుగా జరిగేందుకు సహకారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని