logo

Hyderabad metro : మెట్రో.. అడుగిడేదెట్లో!

ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలు..  పంజాగుట్ట స్టేషన్‌లో మెట్రో కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఈలోపు మెట్రో రానే వచ్చింది. దిగేవారి కంటే ఎక్కేవారు ఎక్కువగా ఉన్నారు. కొద్దిమందే ఎక్కగలిగారు. మరో మెట్రో కోసం కొందరు ఆగిపోయారు.

Updated : 04 Jul 2022 08:23 IST
రద్దీతో ప్రయాణికుల ఇబ్బందులు
ట్రిప్‌ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తులు
ఈనాడు, హైదరాబాద్‌
అతి కష్టంగా నిల్చొని ప్రయాణం

* ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలు..  పంజాగుట్ట స్టేషన్‌లో మెట్రో కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఈలోపు మెట్రో రానే వచ్చింది. దిగేవారి కంటే ఎక్కేవారు ఎక్కువగా ఉన్నారు. కొద్దిమందే ఎక్కగలిగారు. మరో మెట్రో కోసం కొందరు ఆగిపోయారు. తర్వాతా అదే పరిస్థితి. అమీర్‌పేట, బేగంపేటలోనూ ఇదే అనుభవం ఎదురైంది.

* అమీర్‌పేట స్టేషన్‌లో ఓ కుటుంబం  మెట్రో ఎక్కారు. ఎలాగోలా లోపలికి అడుగుపెట్టారు. నిలబడేందుకు కూడా చోటు లేదు. ఇంత రద్దీ ఉంటుందనుకుంటే బస్సుల్లో వెళ్లేవారమని వాపోయారు.

ఆధునిక ప్రజారవాణా మెట్రోలో ప్రయాణికుల అనుభవాలివి. కొవిడ్‌ అనంతరం ప్రయాణికులు తగ్గిపోయారని వాపోయిన సంస్థ.. ఇప్పుడు పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లను నడపడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదివరకు ఉదయం, సాయంత్రమే రద్దీ ఉండేది. ప్రస్తుతం వేళలతో పని లేకుండా మెట్రో నిండా ప్రయాణికులే ఉంటున్నారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గం నిత్యం కిటకిటలాడుతోంది. చాలామంది రైలు ఎక్కలేకపోతున్నారు. నిలబడేందుకు చోటుండటం లేదని వాపోతున్నారు.
లూప్‌ మెట్రో.. కార్యాలయ వేళల్లో రద్దీని తట్టుకునేందుకు కొన్ని  స్టేషన్ల నుంచి లూప్‌ మెట్రోలను నడుపుతున్నారు. ఇదే తరహాలో రద్దీ ఎప్పుడుంటే అప్పుడు నడపాలని  కోరుతున్నారు. రద్దీని ఉప్పల్‌లోని కంట్రోల్‌ సెంటర్‌ నుంచే పర్యవేక్షించే అవకాశం ఉన్నందున.. ఐదు నిమిషాలకు కాకుండా మూడు నిమిషాలకు ఒక మెట్రో నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం మెట్రోలో సగటున మూడున్నర లక్షల మంది వరకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాల ప్రారంభంతో ఈసంఖ్య ఇటీవల మరింత పెరిగింది. మహిళలకు కేటాయించిన కోచ్‌లు సైతం పురుషులతో నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అతివలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహణలో వైఫల్యం.. అధునాతనంగా నిర్మించిన రైలు స్టేషన్లను చిన్నపాటి విమానాశ్రయాలుగా మెట్రో అధికారులు అభివర్ణించారు. తొలుత అలానే ఉన్నా.. ప్రస్తుతం మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. నాలుగేళ్లలోనే చాలా స్టేషన్లలో కమోడ్‌లు, నల్లాలు విరిగిపోయాయి. నిర్వహణ లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి. మలక్‌పేట, మియాపూర్‌ స్టేషన్లలో చాలాసార్లు ఫిర్యాదు చేసినా మార్పులేదని ప్రయాణికులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని