logo

vijya sankalp sabha : భాగ్యనగరాన.. అభివృద్ధే నమో స్వరాన

ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం జపించారు. కొత్త రాష్ట్రం పురోగతిలో అడుగడుగునా తోడున్నామంటూ చెప్పారు. నగరంలో పరేడ్‌ మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన చేసిన ప్రసంగం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన

Updated : 04 Jul 2022 08:20 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, చిత్రంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మోహన్‌రావు, మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, బొమ్మై, నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా, బండి సంజయ్‌

ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం జపించారు. కొత్త రాష్ట్రం పురోగతిలో అడుగడుగునా తోడున్నామంటూ చెప్పారు. నగరంలో పరేడ్‌ మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన చేసిన ప్రసంగం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేంద్ర మంత్రులు, కీలక నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. అంతకుముందు హెచ్‌ఐసీసీలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు మధ్యాహ్నం ముగిశాయి. అక్కడి నుంచి కీలకనేతలంతా సికింద్రాబాద్‌లోని సభాస్థలికి చేరుకున్నారు.

హెచ్‌ఐసీసీ నుంచి సభ జరిగే పరేడ్‌ మైదానానికి బయలుదేరుతున్న ప్రదాని నరేంద్ర మోదీ


సంకల్పించి.. సత్తా చూపించి
సభ విజయవంతంతో భాజపాలో నూతనోత్సాహం

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్‌: నగర భాజపా నేతలు రాత్రి పగలూ తేడా లేకుండా పడ్డ కష్టం ఫలించింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ విజయంలో రాజధాని పరిధిలో మూడు జిల్లాల నేతలు కీలక భూమిక పోషించారు. ప్రధాన మోదీ పాల్గొంటున్న బహిరంగ సభను నభూతో అన్నట్లుగా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కంటే నగర పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచే వేలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి నగర నేతలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా జనసేకరణలో విజయవంతం కావడంతో సభ జరిగిన పరేడ్‌ గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. బయట కూడా భారీగా జనాలు ఉండిపోయారు. ఈ పరిణామం మూడు జిల్లాల పార్టీ విభాగాల్లో కొత్త ఉత్సాహం నింపింది.

పరేడ్‌ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీని చూడడానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేస్తున్న పోలీసులు

దాదాపు రెండు నెలల కిందట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిగింది. అప్పట్లో ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. అది విజయవంతం చేశారని అమిత్‌షా నగర నేతలను అభినందించారు. ఆ అనుభవంతో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నెల రోజుల కిందట తలపెట్టారు. నగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగువేల మందికి తక్కువ కాకుండా సభకు తీసుకువచ్చే బాధ్యతను నియోజవర్గాల నేతలకు అప్పగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఇతర నేతలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.  


డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్లకార్డు ప్రదర్శిస్తున్న కార్యకర్త


కార్పొరేటర్ల కీలక పాత్ర!

నగరానికి చెందిన భాజపా కార్పొరేటర్లు జన సమీకరణలో కీలక భూమిక పోషించారు. ముందుగానే వీరికి లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక కాలనీల నుంచి వాహనాలను ఏర్పాటు చేసి వీరు జనాన్ని తరలించారు. వీరికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పూర్తి తోడ్పాటు అందించారు. తమకు ఈ సౌకర్యం కావాలని కోరిన వెంటనే మంత్రి కిషన్‌ ఏర్పాటు చేశారని ఓ కార్పొరేటర్‌ ‘ఈనాడు’కు తెలిపారు.  


జన స్పందనే రాష్ట్రంలో పార్టీ విజయానికి సూచిక
కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. మైదానం సరిపోకపోవడంతో మూడింతలు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చిన వారిలో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలో భాజపా గెలుపు నల్లేరు మీద నడకేనని అర్థం అవుతోంది. ప్రధాని మోదీ ప్రసంగానికి జనం నుంచి లభించిన స్పందన అమోఘంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర పార్టీ ముందుకు వెళ్తుంది.

డప్పుదరువులతో సభా ప్రాంగణానికి వస్తున్న కళాకారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని