logo

సంకల్ప భేరి.. తెలంగాణే గురి

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.  పార్టీ అగ్రనేతల స్ఫూర్తిమంతమైన ఉపన్యాసాలతో కార్యకర్తల్లో సరికొత్త జోష్‌ కనిపించింది.

Published : 04 Jul 2022 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.  పార్టీ అగ్రనేతల స్ఫూర్తిమంతమైన ఉపన్యాసాలతో కార్యకర్తల్లో సరికొత్త జోష్‌ కనిపించింది. వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన పార్టీ అభిమానులతో సభాస్థలి కళకళలాడింది. ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతల కటౌట్లు ప్రాంగణం నిండా కనిపించాయి.

సభ వద్ద సాయంత్రం 4 గంటల నుంచి జనాల కిటకిట మొదలైంది.  6.30 వరకు జనాలు వస్తూనే ఉండటంతో సభాస్థలి కిటకిటలాడింది.

సీట్లన్నీ నిండిపోవడంతో ఆలస్యంగా వచ్చిన వేల మంది జనాలు నిల్చొనే నేతల ప్రసంగాలను విన్నారు.  

వికారాబాద్‌, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను సంజీవయ్య పార్కు నుంచి నెక్లెస్‌ రోడ్‌ పీవీ విగ్రహం వద్ద ఆపేయడంతో వందలాది వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అక్కడి నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లేందుకు జనాలకు సుమారు 4 కి.మీ. నడక తప్పలేదు.  

దూర ప్రాంతాలకు వెళ్లేవారు త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో గేట్‌ నంబర్‌-5 నుంచి బయటకు వెళ్లేందుకు ఎగబడ్డారు. మెటల్‌ డిటెక్టర్లను తోసేసి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.  


మోదీ నోట.. ఓరుగల్లు మాట

రంగంపేట, న్యూస్‌టుడే: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భాజపా విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగించారు స్థానికతకు పెద్ద పీటవేస్తూ రాష్ట్రంలోని ఆయా జిల్లాల విశేషాలను ఆయన ప్రస్తావించారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు చారిత్రక కట్టడాలను వెల్లడించారు. ఎంతో వైశిష్ట్యం గల వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, ప్రపంచ వారసత్వ కేంద్రం రామప్ప ఆలయం పేర్లను ఆయన ప్రస్తావించారు. వరంగల్‌ నగర శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ను అభివృద్ధి పరుస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల పేర్లు ప్రధాని ప్రస్తావించడంతో భాజపా నాయకులు, కార్యకర్తల కేరింతలు కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని