GHMC: వారంలోగా 60వేల ఇళ్ల పంపిణీకి కార్యాచరణ.. అధికారులకు కేటీఆర్‌ ఆదేశాలు

జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో.. వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం

Published : 05 Jul 2022 01:56 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో.. వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు.. ఇందులో 60 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. నానక్‌రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

పూర్తయిన 60వేల ఇళ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారంలోగా సిద్ధం చేయాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క ఇల్లు కచ్చితంగా గూడు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాల కోసం పెద్దఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేవారం మరోసారి ఈ అంశంపై సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఆలోగా తుది మార్గదర్శకాలతోపాటు ఇళ్ల పంపిణీకి కచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని