logo
Updated : 05 Jul 2022 04:28 IST

వలయ దారిలో రుధిర ధార

ఏడాదిలో 70 మంది దుర్మరణం

ఓఆర్‌ఆర్‌పై అతి వేగం, లారీల పార్కింగ్‌లతో ప్రమాదాలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; న్యూస్‌టుడే, శంషాబాద్‌

బాహ్య వలయ రహదారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌పై ఏటా 70 మంది చనిపోతుంటే 200 మందికి పైగా గాయపడుతున్నారు. ప్రమాదాలు జరగడానికి అతి వేగం ఒక కారణమైతే.. నిబంధనలకు విరుద్ధంగా లారీలను రోడ్డు పక్కన నిలపడం మరో కారణమవుతోంది. సోమవారం శంషాబాద్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై నిలిపిన లారీని ఓ కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.

రెండు వైపులా కలిపి మొత్తం 8 లైన్లలో ఓఆర్‌ఆర్‌ను నిర్మించారు. మొదటి రెండు లైన్లలో వంద కి.మీ. వేగ పరిమితిని నిర్దేశించారు. కానీ వాహనదారులు 120-140 కి.మీ. వేగంతో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో వేగాన్ని నియంత్రించుకోలేక విభాగినులను ఢీకొంటున్నారు. 100 కి.మీ. వేగంతో వెళ్లాల్సిన 1, 2 లైన్లలో ఉన్నపళంగా వేగాన్ని 60 కి.మీ.కు తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 80 కి.మీ. కంటే తక్కువ వేగంతో వెళ్లే లారీ డ్రైవర్లు కొన్ని సార్లు 1, 2 లైన్లలోకి వచ్చేయడమూ ప్రమాదాలకు దారితీస్తోంది.

ఆ రెండు మృత్యుకుహరాలు

త్వరగా గమ్యస్థానాలకు, శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లాలనుకొనేవారు ఓఆర్‌ఆర్‌ను ఎంచుకుంటారు. లారీలు మరమ్మతులకు గురైతే నిలిపేందుకు కొన్ని నిర్దిష్ట స్థలాలను ఏర్పాటు చేశారు. లారీ డ్రైవర్లే కాకుండా కారు డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ పక్కకు నిలిపేస్తున్నారు. వేగంలో ఇది గుర్తించని వాహనదారులు ఆయా వాహనాలను ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. శంషాబాద్‌కు దగ్గరలోని చెన్నమ్మ హోటల్‌ వద్ద రోడ్డు ఎత్తు, పల్లంగా ఉంటుంది. ఇక్కడ గతంలో ఇటుక లారీ బోల్తా కొట్టడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఈ రెండు చోట్ల లారీలను నిలపడం ప్రమాదాలకు దారితీస్తోంది. అతి వేగాన్ని నిరోధించే విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం, జరిమానాలతోనే సరిపెట్టడం వల్లే ఈ పరిస్థితి అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగోల్కొండ, చెన్నమ్మ హోటల్‌ సమీపంలో రహదారి నిర్మాణం, లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

మృతి చెందిన ప్రముఖులు

* సినీ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు వెంకట్‌ శంషాబాద్‌లోని చెన్నమ్మ హోటల్‌ సమీపంలో జరిగిన బైక్‌ ప్రమాదంలో మరణించారు.

* సెంట్రల్‌ ఎక్సైజ్‌ సహాయ కమిషనర్‌ సతీమణి, కుమార్తె, బావమరిది విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తూ పెద్ద గోల్కొండ జంక్షన్‌ సమీపంలో ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి ఢీకొన్నారు. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

* ఏపీ మాజీ మంత్రి, ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కారులో విజయవాడకు వెళుతుండగా పెద్ద గోల్కొండ జంక్షన్‌ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆయన భార్య, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మాజీ మంత్రి సీటు బెల్టు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

* సినీ కథానాయకుడు రవితేజ తమ్ముడు భూపతిరాజ్‌ కారు చెన్నమ్మ హోటల్‌ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.

ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురి దుర్మరణం

శంషాబాద్‌,న్యూస్‌టుడే: బాహ్యవలయ రహదారిపై ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్దగోల్కొండ కూడలి వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఆనంద్‌, రంగనాథ్‌, సంపత్‌ చెందిన ముగ్గురు యువకులు (35 సంవత్సరాల లోపు) క్రెటా కారులో తుక్కుగూడ వైపు నుంచి గచ్చిబౌలికి బయలుదేరారు. అతి వేగం, వర్షం కారణంగా పెద్దగోల్కొండ జంక్షన్‌ వద్ద ఆగి ఉన్న భారీ కంటైనర్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌, శంషాబాద్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గంటకు పైగా శ్రమించి ముగ్గురి మృత దేహాలను బయటకు తీశారు. మృత దేహాలను ఉస్మానియా శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఓఆర్‌ఆర్‌ స్వరూపం

పొడవు: 158 కి.మీ.

ప్రారంభం: 2006

లైన్లు: 8(ఒక్కో వైపు నాలుగు లైన్లు)

1, 2 లైన్లలో వేగ పరిమితి: 120 కి.మీ. (ప్రస్తుతానికి 100 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకే అనుమతి)

3, 4 లైన్లలో వేగ పరిమితి: 80 కి.మీ.

ఇంటర్‌ఛేంజ్‌లు: 19

సర్వీస్‌ రోడ్లు: 316 కి.మీలు (ఒక్కో వైపు 158 కి.మీలు).

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని