logo
Published : 05 Jul 2022 01:53 IST

నాలాల్లో ప్లాస్టిక్‌ ప్రళయం

వరద, మురుగునీటి కాలువల్లో భారీగా వ్యర్థాలు

కొరవడిన పౌర స్పృహతో పొంచిఉన్న వరద ముప్పు

ఈనాడు, హైదరాబాద్‌

సీతాఫల్‌మండిలోని ఓ చిన్న వీధిలో మ్యాన్‌హోల్‌లో

బయటపడ్డ ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలివి

గ్రేటర్‌ నాలాలను ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. పూడికతీత మట్టిలో సుమారు 40శాతం ప్లాస్టిక్‌, ఇతర గృహోపకరణాలే. ఇలాంటి దుస్థితితోనే నగరంలోని లోతట్టు ప్రాంతాలు ప్రతి చిన్న వర్షానికీ నీట మునుగుతున్నాయి. కురిసిన ప్రతి చినుకూ రోడ్లను ముంచెత్తుతోంది. ముంపుతో ఏటా వేలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. చెత్తను నాలాల్లో, మ్యాన్‌హోళ్లలో వేయకూడదనే స్పృహ పౌరుల్లో లోపించడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. వ్యర్థాల సేకరణను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న అధికారులూ బాధ్యులే.

40 శాతమంటే ప్రమాదమే..

నగరంలో రోజూ ఇంట్లో, వాణిజ్యపరంగా హోటళ్లు, పరిశ్రమల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాల పరిమాణం 6,000టన్నులు ఉంటోంది. ఇంటింటి నుంచి సేకరించే వ్యర్థాల్లో కన్నా.. పౌరులు జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ ఆటోకు ఇవ్వకుండా నాలాల్లో పడేస్తున్న వ్యర్థాల్లోని ప్లాస్టిక్‌ శాతమే ఎక్కువగా ఉంటోంది. ఖాళీ ప్రదేశాలు, రహదారులు, బస్టాండ్లు, వ్యాపార సముదాయాల కింద పడేసే ప్లాస్టిక్‌ సీసాలు, కవర్లు, ఇతర వస్తువులు నాలాల్లోకి కొట్టుకుపోతున్నాయి. బస్తీలు, కాలనీలవాసులు ఇంట్లోని ప్లాస్టిక్‌ వస్తువులు, పనికిరాని పరుపులు, చెక్క వస్తువులు, సోఫాలు, కుర్చీలు, కవర్లు, నిర్మాణ వ్యర్థాలు, బియ్యం సంచులు, ఇతరత్రా వ్యర్థాలను నాలాల్లో పడేస్తున్నారు. ఇలాంటివే నాలాల పూడికతీతలో 40శాతముంటున్నాయి. ఇవన్నీ నీటిపై తేలుతూ, కల్వర్టులు, పైపులైన్ల వద్ద వరదకు అడ్డుపడతాయి. టెలికాం కేబుళ్లు, ఇతరత్రా భూగర్భ కేబుళ్లు భూగర్భ వరద, మురుగునీటి పైపులైన్లలో కొన్ని చోట్ల అంతర్భాగంగా ఉంటాయి. అలాంటి చోట ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు తీగలకు తగులుకుని వరదను అడ్డుకుంటున్నాయి. మూడేళ్ల కిందట శిల్పారామం ఎదురుగా ఉండే వరద నీటి కాలువల్లో అదే జరిగింది. బయో డైవర్సిటీ పార్కు వద్ద ఎస్కీ పక్కనున్న కల్వర్టు పూర్తిగా మూసుకుపోవడంతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ వద్ద నడుముల్లోతున నీరు నిలిచింది. అటుగా వెళ్లిన వాహనాలు ఖాజాగూడ చెరువు వైపు కొట్టుకుపోయే ప్రమాదం తలెత్తింది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి వద్ద హుస్సేన్‌సాగర్‌ వరదనీటి నాలా కల్వర్టులో సగం పూడిక మట్టితో మూసుకుపోయింది. అశోక్‌నగర్‌ కల్వర్టు వద్ద కూడా పూడిక వ్యర్థాలు గుట్టలుగా నిలిచాయి. కాలనీలు, బస్తీల గుండా ప్రవహించే నాలాల్లోనూ అడుగడుగునా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి.

పూడికతీతతో వెలుగులోకి..

ఈ ఏడాది ప్రారంభంలో జీహెచ్‌ఎంసీ 371 ప్రాంతాల్లో రూ.56.31కోట్లతో పూడికతీత పనులు చేపట్టింది. 3.39లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించింది. అందులో 40శాతం ప్లాస్టిక్‌, ఇంట్లోని పాత సామగ్రే. మెజార్టీ వ్యర్థాలు కల్వర్టుల వద్ద నుంచి తొలగించినవే. ఈ పరిస్థితులు తీవ్రమైన ప్రమాదానికి సంకేతమని ఇంజినీర్లు వాపోతున్నారు. పూడికలో మట్టి 20శాతమే ఉంటుందని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని